వికారాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : యాసంగి సీజన్లో వరి పండించిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రతీ రైతు నుంచి ధాన్యాన్ని సేకరించాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రం ఈ దఫా కూడా ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం చేస్తూ చేతులెత్తేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏయే గ్రామాల్లో అధిక మొత్తంలో వరి సాగవుతుందనే వివరాలను బట్టి ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
యాసంగి సీజన్లో ఎంత దిగుబడి వచ్చినప్పటికీ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులెవరూ తక్కువ ధరకు ఇతరులకు విక్రయించకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని రైతులకు ప్రభుత్వం సూచించింది. మరోవైపు వడ్లను క్వింటాలుకు ఏ గ్రేడ్ రకం రూ.2060 మద్దతు ధరను, సాధారణ రకం రూ.2040లకు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించనుంది. ధాన్యం విక్రయించిన రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే రెండు, మూడు రోజుల్లోగా చెల్లింపులను జమ చేయనున్నారు. జిల్లాలో 90,300 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేయగా, 1.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు.
ఈ నెలాఖరు నుంచి ధాన్యం సేకరణ
జిల్లాలో ఈ నెలాఖరు నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లావ్యాప్తంగా 120 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 50, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 33, ఏఎంసీ ఆధ్వర్యంలో 10, ఐకేపీ ఆధ్వర్యంలో 24, ఎఫ్‌సీఎస్ ఆధ్వర్యంలో 3 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అధిక మొత్తంలో సాగైన దృష్ట్యా రైతులకు ఇబ్బందులు కలుగకుండా వరి సాగు చేసిన 3-4 గ్రామాలకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒకేరోజు రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకుండా కొనుగోలు కేంద్రం వద్ద ఐదుగురు చొప్పున రైతులుండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోజుకు 50 మంది రైతుల నుంచి 1000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించేలా అధికారులు నిర్ణయించారు. ఇందుకుగాను ధాన్యాన్ని తరలించేందుకు సిద్ధం అయినట్లయితే నేరుగా రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలనేది తేదీతో కూడిన టోకెన్‌ను ఏఈవోలు అందజేస్తారు. మరోవైపు రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు జిల్లాలో 59 గోదాంలను సిద్ధంగా ఉంచారు.
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని గోదాములకు తరలించేందుకు నాలుగు ఏజెన్సీలకు జిల్లా యంత్రాంగం అప్పగించింది. టార్పాలిన్లు, మాయిశ్చర్ మీటర్స్, ఎలక్ట్రానిక్ యంత్రాలు తదితరాలను మార్కెటింగ్ శాఖ ద్వారా ఈ నెలాఖరులోగా అన్ని కొనుగోలు కేంద్రాలకు సమకూర్చనున్నారు. ఈ ఏడాది 57,500 మంది రైతులు 90,300 ఎకరాల్లో వరి సాగు చేశారు. జిల్లాలో ఎక్కువగా పరిగి, కులకచర్ల, దోమ, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్, కొడంగల్, తాండూరు, యాలాల, ధారూరు, మర్పల్లి, కోట్‌పల్లి మండలాల్లో అధికంగా సాగు చేశారు. జిల్లాకు యాసంగిలో 40 లక్షల గన్నీ సంచులు అవసరమని గుర్తించిన అధికారులు ఇప్పటికే జిల్లాలో అందుబాటులో ఉంచారు. ప్రతీ రైతు నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. ధాన్యం గ్రేడ్ ఏ రకం క్వింటాలుకు రూ.2060, సాధారణ రకం రూ.2040లకు రైతుల నుంచి సేకరించనుంది.
వరి సాగు చేసుకునే రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటున్నది
– వెంకట్, ద్యాచారం, వికారాబాద్
కొన్ని సంవత్సరాల నుంచి వరి పంటను సాగు చేస్తున్నాను. ఈ ఏడాది 4 ఎకరాల్లో పంట వేశాను. ప్రస్తుతం యాసంగిలో వరి సాగు చేసుకుంటున్న రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈసారి వరి పంటను కొనుగోలు చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉండడంతో ఎంతో సంతోషంగా ఉంది.
రైతులను ఆదుకుంటున్న సీఎం
– గొల్ల శేఖర్, పర్సాపూర్, కొడంగల్
8 సంవత్సరాల నుంచి సీఎం కేసీఆర్ పాలనలో రైతులందరూ సుభిక్షంగా జీవిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకోవడంతో పాటు పంట అమ్మకాలపై కూడా మాకు ఎటువంటి ఇబ్బంది కలుగడంలేదు. కరోనా కాలంలో కూడా ముఖ్యమంత్రి ఇంటి వద్దనే వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. ఇప్పుడు యాసంగి ధాన్యాన్ని సేకరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. రైతు బాధలు తెలిసిన సీఎం కాబట్టే రైతులకు అడగక ముందే అన్నీ అందిస్తున్న కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో రైతులకు ఎంతో మేలు
– శ్రీనివాస్, ద్యాచారం, వికారాబాద్
వరి రైతులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈసారి వరి రైతులకు భరోసా కల్పిస్తూ వరి పంటల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలాంటి ఎంతో మంది రైతులకు ఈ అవకాశం గొప్ప వరంగా మారుతుంది. బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయకుండా వరి రైతులను ఇబ్బందులపాలు చేస్తుంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్నది. రైతులు సర్కారుకు రుణపడి ఉంటారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సంతోషం – నర్సింహులు, గౌతాపూర్, తాండూరు
కేంద్రంలోని బీజేపీ రైతుల పాలిట శాపంగా మారింది. రైతుకు ఏమీ కావాలో తెలిసిన మహనీయుడు సీఎం కేసీఆర్. రైతు సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే మహా వ్యక్తి కేసీఆర్. రైతు నష్టపోరాదనే సదుద్దేశంతో వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సంతోషాన్ని ఇచ్చింది. రైతు తన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించే అవకాశం కల్పించడం ఆనందంగా ఉంది. ఇటువంటి సీఎం ఉంటే ఎల్లకాలం రైతులు సిరిసంపదలతో సంతోషంగా ఉంటారు.
ధాన్యం కొనుగొలు చేయడం అభినందనీయం
– వడ్ల రాములు, రైతు పూడూరు
యాసంగిలో రైతు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించడం అభినందనీయం. గత సంవత్సరం ధాన్యం కొనుగోలు చేయాలని పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదు. ఈసారీ అదే జరిగింది. ప్రస్తుతం ధాన్యం కొనుగోలుకు తెలంగాణ సర్కార్ ముందుకు రావడం సంతోషం
రైతు కష్టం తెలిసిన ముఖ్యమంత్రి
– బుడుగు లక్ష్మయ్య, దూప్చర్ల, బొంరాస్‌పేట
ఆరుగాలం రైతులు కష్టపడి పంటను పండించిన అనంతరం పంట చేతికి వచ్చే సమయంలో ఎవరికి ఎక్కడ అమ్ముకోవాలో అని గతంలో ఆందోళనకు గురయ్యేవాళ్లం. ఇప్పుడు అటువంటి బాధలు లేవు. పండించిన ప్రతి గింజను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుండటంతో కష్టం తెలువకుండా గింజలను అమ్ముకోవడమే కాకుండా సకాలంలో పైసలు అందుకుంటున్నాం. ఖరీఫ్‌లో పంట అమ్మకాలపై రైతులు ఆందోళన చెందాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు యాసంగి పంట చేతికి రాకముందే ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించడం ఎంతో భరోసా కలుగుతున్నది.