నిజాంసాగర్/ఉప్పునుంతల/ వెల్దండ, మార్చి 4 : యాప్ ద్వారా యూరియా బుకింగ్ వద్దంటూ నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా కోసం ఇబ్బందులు పడలేదని, ప్రజాపాలన ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు రోడ్లపైకి చేరుతున్న పరిస్థితి తలెత్తిందని ధ్వజమెత్తారు. యూరియా వచ్చిందని తెలియడంతో పొద్దున్నే సొసైటీకి వెళ్లి బుక్ చేద్దామంటే కావడం లేదని.. ఇదేమిటని అక్కడి వారిని అడిగితే స్టాక్ లేదంటూ సమాధానం చెబుతున్నారని వాపోయారు. ఓవైపు బుకింగ్ చేస్తుండగానే.. మరోవైపు నోస్టాక్ అంటూ చూపుతుందని వాపోయారు. పాత పద్ధతిలోనే యూరియాను అందించాలని డిమాండ్ చేశారు.
ఆందోళనతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ఎస్సై కురుమూర్తి, ఏవో శోభారాణి చేరుకొని రైతులను సముదాయించారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలానికి 900 బస్తాల యూరియా వచ్చింది. పీఏసీఎస్ వద్ద 300 బస్తాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద 300 బస్తాలు, తాడూర్ హా కా కేంద్రంలో 300 బస్తాల యూరియా అందుబాటులో ఉంచారు. విషయం తెలుసుకొన్న రైతులు బుధవారం ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేందుకు సిద్ధమవగా.. ఒక్క నిమిషంలోనే యూరియా బస్తాలు అయిపోనట్టు యాప్‌లో చూపడంతో రైతులు అవాక్కయ్యారు. కామారెడ్డి జిల్లా మహ్మద్‌నగర్ మండల కేంద్రంలోని గున్కుల్ సొసైటీలో 666 బస్తాల యూరియా వచ్చిందని తెలిసి ఉదయమే రైతులు భారీగా తరలి వచ్చారు. యా ప్లో బుక్ చేసుకున్న రైతులకే బస్తాలు ఇవ్వగా, మిగతా వారికి దొరకలేదు.