Madhyapradesh : ఓ ఆటో డ్రైవర్ (Auto Driver) కుమారుడు స్టైల్‌గా గన్ పట్టుకుని దిగిన ఫొటోను సోషల్ మీడియా (Social Media) లో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. దాంతో స్థానికులు ఆటో డ్రైవర్ దగ్గర మారణాయుధాలు (Weapans) ఉన్నాయనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడి ఇంట్లో సోదాలకు వెళ్లారు. ఈ సోదాల్లో పోలీసులకు మారణాయుధాలుగా బదులుగా కోట్ల రూపాయల్లో నగదు లభించడంతో షాకయ్యారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని సాగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సాగర్ జిల్లాలోని గోపాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ రాజేశ్ అహిర్వార్ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు సౌరభ్ అహిర్వార్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశాడు. తుపాకీతో దిగిన ఆ ఫొటో స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. అతని వద్ద మారణాయుధాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగింది. దాంతో విషయం పోలీసులకు చేరింది. ఆటో డ్రైవర్ ఇంట్లో ఆయుధాలు ఉన్నాయన్న అనుమానంతో వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఇంటికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఎంత వెతికినా ఆయుధాలు లభించలేదు. అయితే పెద్దఎత్తున నగదు సంచులు బయటపడ్డాయి.
ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో ఇంత పెద్దమొత్తంలో నగదు కనిపించడంతో పోలీసులు షాకయ్యారు. వెంటనే నగదు లెక్కించే యంత్రాలను తెప్పించారు. సుమారు ఐదు గంటల పాటు శ్రమించి లెక్కను పూర్తిచేశారు. వాటి విలువ రూ.3 కోట్లుగా తేల్చి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందని ఆటో డ్రైవర్ కుటుంబాన్ని పోలీసులు ప్రశ్నించారు. అయితే ఆ డబ్బుతో తమకు ఎలాంటి సంబంధం లేదని వారు తెలిపారు. భోపాల్‌లో ప్రభుత్వ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తమ బంధువు కుటుంబసభ్యులదని వెల్లడించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.