న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి ఊరట లభించింది. రాహుల్ గాంధీ కేసులో విచారణ చేపట్టవద్దు అని అలహాబాద్ హైకోర్టుకు ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎటువంటి నివేదిక హైకోర్టుకు సమర్పించవద్దు అని సీబీఐ, ఈడీని సుప్రీంకోర్టు కోరింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. కపిల్ సిబల్ సమర్పించిన అంశాలను సుప్రీం పరిగణలోకి తీసుకున్నది. ఈ కేసు దాఖలు చేసిన కర్నాటక వాసి ఎస్ విఘ్నేశ్ సిసిర్కు నోటీసులు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్రయించారు.
ఆ అభ్యర్థనపై ఇవాళ సుప్రీం రియాక్ట్ అయ్యింది. వివరణ ఇచ్చేందుకు ఈ కేసులో రాహుల్ గాంధీకి ఎందుకు అవకాశం ఇవ్వలేదని, రాహుల్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండానే హైకోర్టు ఎలా ఆదేశాలు జారీ చేసిందని సుప్రీం ప్రశ్నించింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఏదైనా ఏజెన్సీకి తెలిస్తే, అప్పుడు ఆ ఏజెన్సీ ప్రత్యక్షంగా తన దర్యాప్తును చేసుకోవచ్చు అని, దాని కోసం కోర్టు ఆదేశాలు అవసరం ఏముందని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. ఈ కేసులో దర్యాప్తు ఏజెన్సీలు ఏవి కూడా వ్యక్తిగత చర్యలు తీసుకోలేదని సుప్రీం తెలిపింది.
ఒకవేళ ఇది సీరియస్ అంశమే అయితే, మీ ఏజెన్సీ ఎందుకు మౌనంగా ఉందని, కోర్టు నుంచి మీకు ఆదేశాలు కావాలా, ఏవైనా సుమోటో చర్యలు తీసుకున్నారా అని సీబీఐ తరపున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును జస్గిస్ బాగ్చీ ప్రశ్నించారు.