సామాజిక మాధ్యమాలు చూస్తుంటే న్యూస్ పేపర్లోని ఒక వార్తపై ఒకరు పెట్టిన పోస్ట్ ఆసక్తిగా అనిపించింది. హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ‘దేశం కోసం మీరు ప్రధాన మంత్రి పదవి చేపట్టాలి’ అని రేవంత్‌రెడ్డి పట్టుపట్టారట. ‘నేను సీఎంగా కాదు.. పార్టీ కార్యకర్తగా అడుగుతున్నాను’ అని ఆయన బతిమిలాడితే ఎట్టకేలకు రాహుల్ గాంధీ సరే అన్నారట. ఇది ఆ వార్త సారాంశం.
అచ్చం న్యూస్ పేపర్లలో ప్రచురించినట్టే రాజకీయ పార్టీలు కొన్ని బోగస్ వార్తలు ప్రచారంలోకి తీసుకురావడం ఎక్కువైంది. కాబట్టి ఈ వార్త కూడా అలాంటిదే అనిపించి, ఆ వార్త గురించి ‘గ్రోక్’ అనే కృత్రిమ మేధను అడిగితే ఎవరో వ్యంగ్యంగా అలా తయారుచేసి ఉండవచ్చునని సమాధానం చెప్పింది. ఆ తర్వాత ఇంగ్లీష్ పేపర్లలో కూడా ఆ వార్త వచ్చినట్టు కనిపిస్తే వాటిని ముందేసుకుని చూస్తే.. ఆ వార్త వ్యంగ్యంగా ఎవరో తయారు చేసింది కాదు.. కాంగ్రెస్ పార్టీనే అన్ని పత్రికలకు చెప్పి రాయించిందని తేలింది. ఈ వార్తను చివరకు కృత్రిమ మేధ ‘గ్రోక్’ కూడా వ్యం గ్యంగా రాశారనే చెప్తున్నదంటే ఆ పార్టీ తీరు ఎంత హాస్యాస్పదంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
ప్రధానమంత్రి పదవి చేపట్టాలని రాహుల్ గాంధీని రేవంత్‌రెడ్డి బతిమిలాడి ఒప్పించడం, దానికి సరేలే అని ఆయన ఒప్పుకోవడం చూస్తుంటే.. కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో ‘ప్రధాని అనే ఓ కుర్చీ సిద్ధం చేశారు.. రాహుల్‌ను ఆ కుర్చీలో కూర్చోబెట్టడమే తరువాయి’ అన్నట్టుగా ఉన్నది.
ఈ సందర్భంగా నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ శ్రేణులు తలచుకుంటే వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చే సత్తా ఉన్నదని రేవంత్ బహిరంగంగానే ప్రకటించారు. ఒకరిని తిట్టాలన్నా, పొగడ్తలతో ముంచెత్తాలన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల తర్వేతే ఎవరైనా! రాహుల్ గాంధీని బీజేపీ వాళ్లు ‘పప్పు’ అని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే మీడియా సమావేశాల్లో రాహుల్ గాంధీని ‘పప్పు’ అని ఎక్కువగా ప్రచారం చేసింది రేవంత్‌రెడ్డే. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా రేవంత్ ఉన్నప్పుడు రాహుల్ గాంధీని ‘పప్పు’ అని, సోనియా గాంధీని ‘బలిదేవత’ అని విమర్శించేవారు.
గతంలో ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు సోనియా గాంధీ సిద్ధమైన తర్వాత విదేశీ వనిత ఆ పదవిని చేపట్టడం రాజ్యాంగ వ్యతిరేకమని సుబ్రహ్మణ్యస్వామి కేసు వేయడం, సోనియా ప్రధాన మంత్రి పదవి చేపడితే గుండు గీయించుకుంటానంటూ సుష్మా స్వరాజ్ తెలిపిన నిరసనల మధ్య సోనియా వెనుకడుగు వేయాల్సి వచ్చింది. అప్పుడు సోనియా ‘త్యాగం’ పేరిట సమావేశం నిర్వహించారు. ఆ సభలో తలలు పండిన సీనియర్లు అందరూ సోనియా గాంధీ ‘త్యాగాన్ని’ వేనోళ్ల పొగిడారు. టీడీపీ ఫైర్‌బ్రాండ్‌గా పేరుపొంది, కాంగ్రెస్‌లో చేరిన రేణుకా చౌదరి సోనియా గురించి ఏమీ చెప్పకుండా మైకు పట్టుకొని బోరున విలపించారు. సభలో ఉన్న కొందరు దిగ్గజ నేతలు సైతం ఈ హఠాత్పరిణామానికి ‘ఔరా’ అని ఖంగుతిన్నారు. ఆ ఒక్క ఎత్తుగడతో రేణుకా చౌదరి కాంగ్రెస్‌లో తన స్థానాన్ని సుస్థిర పరుచుకున్నారు. దేశంలో కాంగ్రెస్ హవా సాగినన్ని రోజులు ఆమె కీలక స్థానంలో ఉన్నారు.
‘పోకిరి’ సినిమాలో ‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం’ అనే పూరి జగన్నాథ్ డైలాగ్‌లా అప్పుడు రేణుకా చౌదరిలానే ఇప్పుడు రేవంత్‌రెడ్డి అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకుంటున్నారు. తలలు పండిన కాంగ్రెస్ నాయకులను మించి రాహుల్‌ను ప్రధాని అని ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో రేవంత్‌రెడ్డికి తెలియదా? రెండున్నరేండ్ల కాలం గడిచిపోయింది. మిగిలిన సగం కాలం పూర్తిచేసుకోవడంపైనే తన దృష్టి ఉంటుంది కానీ, రాహుల్ భవిష్యత్తు మీద కాదు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. మైనారిటీ ఓట్ల వల్ల ఆ మాత్రమైనా సాధ్యమైంది. దేశంలో 28 రాష్ర్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే.. కేవలం కర్నాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లోనే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. రెండే రెండు పెద్ద రాష్ర్టాలు కర్నాటక, తెలంగాణ. రెండున్నరేండ్ల పాలనలో ఈ రెండు రాష్ర్టాల్లో కాంగ్రెస్ బోలెడు వ్యతిరేకతను మూటగట్టుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 21.19 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి 36.56 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన పలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తన బలాన్ని క్రమంగా కోల్పోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన 99 సీట్లల్లో సింహభాగం కర్నాటక, తెలంగాణ, కేరళ నుంచి మాత్రమే వచ్చాయి.
2024 ఎన్నికల్లో అంతో బలంగా ఉన్న రాష్ర్టాల్లో కూడా కాంస్ పార్టీ బలహీనపడుతూ వస్తున్నది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు ఎంఐఎంకు, కొత్తగా ఏర్పడిన ఇస్లాం పార్టీకి వెళ్లాయి. దీనివల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకుకే భారీ గండిపడింది. ఈ నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మైనారిటీ ఓట్లలో గండిపడడం ఖాయం. గత ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ వద్ద నిరుద్యోగులతో గంటల తరబడి సమావేశాలు నిర్వహించి ‘మీకు అండగా నేను ఉన్నాను. ఎప్పుడు పిలిచినా వస్తాను’ అని నమ్మబలికారు. ఇప్పుడేమో హైదరాబాద్‌కు రాహుల్ వస్తే చాలు.. అశోక్‌నగర్‌లో ఆంక్షలు విధిస్తున్నారు. ‘ఆరు గ్యారంటీలకు నాది హామీ’ అని రాహుల్, ప్రియాంక మాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక హామీల సంగతి మరిచిపోయారు. రెండున్నరేండ్లయినా గ్యారెంటీల అమలు సంగతి ఎలా ఉన్నదని రాహుల్ సమీక్ష జరపలేదు. ‘కప్పం కడితే చాలు.. ఏమైనా చేసుకోండి’ అన్నట్టుగా ఉన్నది రాహుల్ తీరు. కాంగ్రెస్ సరార్ ఖమ్మంలో పేదల ఇండ్లు కూల్చి, వారి బతుకులను రోడ్డుపాలు చేసింది. ఈ హృదయవిదారకమైన బుల్డోజర్ అరాచకంపై కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. కానీ ‘మొహబ్బత్కే దుకాణ్’ అంటూ తిరిగిన రాహుల్ గాంధీ మాత్రం అస్సలే స్పందించడం లేదు.
‘నన్ను కోసినా రూపాయి రాదు’ అంటూ ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు సమకూర్చడానికి తామంతా సిద్ధమని ప్రకటించారు. ప్రజలు ఎలాపోతేనేం, పదవిని కాపాడుకోవడానికి గాంధీ కుటుంబం ముఖ్యమని సీఎం చెప్తున్నారు. తెలంగాణకు కాంగ్రెస్ రెండున్నరేండ్లలో ప్రజలకు క్రమంగా దూరమవుతున్నది. అదే సమయంలో గాంధీ కుటుంబానికి ఆయన చేరువవుతున్నారు. రాహుల్ కోసం రేవంత్ ‘దేవతా వస్ర్తాల కుర్చీ’ పేరుతో తనను కుర్చీ నుంచి దించేయకుండా చూసుకుంటున్నారు. రెండున్నరేండ్ల తర్వాత తీర్పు చెప్పేది తెలంగాణ ప్రజలే కానీ గాంధీ కుటుంబం కాదు.