కోల్‌కతా : ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో తడబడుతూ అంతర్జాతీయ క్రికెట్లో ‘చోకర్స్’ ముద్ర వేసుకున్న దక్షిణాఫ్రికా మరోసారి అదే బాటలో నడిచింది. టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్, సూపర్-8 దశలోఅదరగొట్టి అజేయంగా సెమీస్ చేరిన ఆ జట్టు.. కీలక పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ఒడిదొడుకుల నడుమే సెమీస్‌కు వచ్చిన కివీస్.. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి రెండోసారి ఈ టోర్నీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇరుజట్ల మధ్య కోల్‌కతాలో జరిగిన తొలి సెమీస్‌లో కివీస్.. 9 వికెట్ల తేడాతో సఫారీలపై ఘనవిజయం నమోదుచేసింది. ముందు బంతితో మార్క్మ్ సేనను 169/8 కే పరిమితం చేసిన ఆ జట్టు.. ఛేదనను 12.5 ఓవర్లలోనే దంచేసింది. టోర్నీలో అంచనాలను అందుకోలేక విమర్శలు ఎదుర్కున్న ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఫిన్ అలెన్ (33 బంతుల్లో 100 నాటౌట్, 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) అసలైన సమయానికి జూలు విదిల్చి పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకం బాది మ్యాచ్‌ను పూర్తి ఏకపక్షంగా మార్చేశాడు. అలెన్‌తో పాటు టిమ్ సీఫర్ట్ (33 బంతుల్లో 58. 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. అంతకుముందు కివీస్ స్పిన్నర్లు కట్టడిచేయగా.. మార్కో యాన్సెన్ (30 బంతుల్లో 55, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), డెవాల్డ్ బ్రెవిస్ (27 బంతుల్లో 34, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) సౌతాఫ్రికాకు గౌరవప్రదమైన స్కోరునందించారు.
మోస్తరు ఛేదనలో కివీస్ ఆరంభం నుంచే సౌతాఫ్రికా బౌలర్లపై విచక్షణ లేకుండా ఎదురుదాడికి దిగింది. సీఫర్ట్, అలెన్ విధ్వంసకరమైన మెరుపులతో పవర్ ప్లేలోనే ఆ జట్టు విజయం దాదాపుగా ఖాయమైంది. ఈ జోడీ వంతులు వేసుకుని మరీ సఫారీ బౌలర్లను చీల్చి చెండాడింది. మొదటి ఓవర్లో రెండు బౌండరీలతో ఛేదన ఆరంభించిన సీఫర్ట్.. యాన్సెన్ 3వ ఓవర్లో 18 రన్స్ రాబట్టాడు. బాష్ ఆరో ఓవర్లో అలెన్.. 6, 4, 4, 4, 4తో 22 రన్స్ రావడంతో పవర్ ప్లేలోనే కివీస్ 84/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఎంగిడి ఓవర్లో బౌండరీతో సీఫర్ట్ హాఫ్ సెంచరీతో పాటు ఆ జట్టు వంద పరుగుల మార్కునూ దాటింది. కేశవ్ 9వ ఓవర్లో సింగిల్‌తో అలెన్ సింగిల్‌తో 19 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. రబాడా పదో ఓవర్లో సీఫర్ట్ బౌల్డ్ అవడంతో 117 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడినా అది కివీస్ విజయంపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. కేశవ్ ఓవర్లో 4,6తో ఛేదనలో వేగం పెంచిన అలెన్.. యాన్సెన్ 12వ ఓవర్లో 4, 4, 6, 6, 4తో శతకంతో పాటు మ్యాచ్‌నూ ముగించాడు. 25 బంతుల్లో 65 రన్స్‌తో ఉన్న అలెన్.. 8 బంతుల్లోనే 35 రన్స్ రాబట్టడం విశేషం.
టాస్ గెలిచిన శాంట్నర్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకోగా అతడి వ్యూహం ఫలించింది. పార్ట్‌టైమ్ స్పిన్నర్ల ధాటికి సఫారీ టాపార్డర్ కుదేలైంది. కివీస్ సారథి వ్యూహాత్మకంగా రెండో ఓవర్లోనే కోల్ మెక్కొంకికి బంతినివ్వగా అతడు.. ఫామ్‌లో లేని డికాక్ (10)తో పాటు రికెల్టన్నూ డకౌట్ చేసి సౌతాఫ్రికాకు డబుల్ షాకులిచ్చాడు. నాలుగో స్థానంలో వచ్చిన బ్రెవిస్ కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అయితే 8వ ఓవర్లో బంతినందుకున్న రచిన్ బౌలింగ్‌లో.. నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి లాంగాన్‌లో మిచెల్ పట్టిన వివాదాస్పద క్యాచ్‌కు ఔట్ అయ్యాడు. పదో ఓవర్లో రచిన్.. ప్రమాదకర మిల్లర్ (6)ను వెనక్కిపంపగా నీషమ్ 11వ ఓవర్లో బ్రెవిస్ కూడా ఔట్ అవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను యాన్సెన్, స్టబ్స్ అదుకున్నారు. ఈ జోడీ ఆరో వికెట్‌కు 47 బంతుల్లోనే 73 రన్స్ జతచేసింది.
1 టీ20ల్లో ఐసీసీ శాశ్వత సభ్యత్వం కల్గిన దేశంపై ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ అలెన్. మిల్లర్, రోహిత్ (35 బంతుల్లో) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లకు 169/8 (యాన్సెన్ 55*, బ్రెవిస్ 34, మెక్కొంకి 2/9, రచిన్ 2/29);
న్యూజిలాండ్: 12.5 ఓవర్లకు 173/1 (అలెన్ 100*, సీఫర్ట్ 58, రబాడా 1/28)