వికారాబాద్, ఫిబ్రవరి 7 : వికారాబాద్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసింది కేసీఆర్ అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి గుర్తు చేశారు. శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున జిల్లా అధ్యక్షుడు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కార్తీక్‌రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా నెరవేర్చని వికారాబాద్ జిల్లాను కేసీఆర్ నెరవేర్చారని పేర్కొన్నారు. గత పదేండ్లలో కొత్త జిల్లాలు, కలెక్టరేట్లు, గ్రామాలకు, మున్సిపల్‌కు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారన్నారు. మిషన్ భగీరథ నీటిని తీసుకొచ్చి మహిళల ఆత్మగౌరవాన్ని పెంచారన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలు తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు.
కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అబద్ధాలు చెబుతూ ఆగమాగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ ఇచ్చిన పథకాలను కొనసాగించలేకపోతున్న, చేతగాని దద్దమలని మండిపడ్డారు. రైతు బంధు, తులం బంగారం, మహిళలకు రూ.2500, చదువుకుంటున్న మహిళలకు స్కూటీలు, ఉచిత గ్యాస్ వంటి పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
ఆనంద్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ధన్నారంకు వచ్చిన ప్రసాద్‌కుమార్ గ్రామాన్ని గ్రామపంచాయతీగా మారుస్తామని హామీ ఇచ్చి మూడేళ్లు కావస్తున్నా మాట నిలబెట్టుకోలేదన్నారు. కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం, మహిళలకు రూ.2500, రైతు భరోసా, ఆసరా పింఛన్లు రూ.4వేలు తదితర పథకాలు అమలు చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓట్ల కోసం ఇంటి ముందు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల వద్ద డబ్బులు తీసుకొని, మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తారని నిలదీయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, పట్టణ అధ్యక్షుడు గోపాల్ముదిరాజ్, పార్టీ అభ్యర్థులు ప్రకాశ్, విజయరాజు, సత్యవేణి, నాయకులు వేణుగోపాల్, షఫీ, అనీల్, కృష్ణ పాల్గొన్నారు.