ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ఊరూరా సందడిగా సాగుతున్నది. ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతోపాటు కండ్లద్దాలు, మందులు అందిస్తుండడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఉదయం నుంచే కంటి వైద్య శిబిరానికి చేరుకొని కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. గురువారం రంగారెడ్డి జిల్లాలో 11,190 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 484 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా.. 420 మంది కోసం ప్రిస్క్రిప్షన్పై అద్దాలను ఆర్డర్ చేశారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 5,336 మందికి కంటి పరీక్షలు చేయగా.. 575 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేశారు. మరో 590 మంది కోసం ప్రిస్క్రిప్షన్పై అద్దాలను ఆర్డరిచ్చారు.
షాబాద్, మే 11 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో మొత్తం 11,190 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 484 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 420 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలో 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలున్న వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. గురువారం 5336మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 575 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 590 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 433 గ్రామాలు, 83 వార్డుల్లో వైద్య శిబిరాలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
అద్దాలు తీసుకున్నా..
– భారతి, ఇంద్రారెడ్డినగర్,
గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు. బీఆర్ఎస్ ఏర్పడిన అనంతరం పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఇదివరకు కంటి పరీక్షలు చేసుకోవాలంటే పట్టణ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధ తప్పింది. ఊర్లకే వచ్చి కంటి పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఉచితంగా ఇస్తున్నారు. నేను పరీక్షలు చేయించుకొని అద్దాలు తీసుకున్నా.