కడ్తాల్, జూన్ 11: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని బీఆర్ఎస్ కడ్తాల్ మండలాధ్యక్షుడు కంబాల పరమేశ్ అన్నారు. బుధవారం కడ్తాల్ మండల కేంద్రంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ సర్కార్ ప్రజల దృష్టిని మళ్లించడానికే కాళేశ్వరం కమిషన్ పేరుతో కొత్త నాటకానికి తెర లేపిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అటకెక్కించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు.
తెలంగాణ ప్రజానీకానికి తాగు, సాగునీరు అందించడానికి భావి తరాలకు ఉపయోగపడే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని, ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకులకు ఒక జన్మ సరిపోదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 11 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 580 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగమని ఆయన వివరించారు. మేడిగడ్డ బ్యారేజ్‌లోని 85 పిల్లర్లకుగానూ రెండు పిల్లర్లు కుంగాయని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం పూర్తిగా కూలిపోయిందని విష ప్రచారం చేసి..విచారణకు రావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి నోటిసులివ్వడం కక్ష సాధింపు చర్యల్లో భాగమని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకులకు నోటీసులు ఇవ్వడంలో కనబరిచే శ్రద్ధను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలపై పెట్టాలని హితవు పలికారు.
ప్రజ సమస్యలను డైవర్షన్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పడుతున్న కష్టాలు వర్ణతాతీమని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రేవంత్ సర్కార్ ఎన్ని కుయుక్తులు పన్నిన ప్రజల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్న చరిష్మాను తగ్గించలేరన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్షీనర్సింహారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వీరయ్య, చల్లంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణయ్యయాదవ్, నాయకులు దాసు, ప్రశాంత్, శ్రీకాంత్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.