మాడ్గుల, మార్చి 30 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంపైగా పూర్తి అయినా మాడ్గుల మండలానికి కల్యాణ లక్ష్మి కింద పేదింటి ఆడపడుచుల వివాహాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ రూ. లక్ష, తులం బంగారం ఇస్తామన్నారు. నేటికీ మండలానికి ఒక్కటంటే ఒక్కటి కూడా రాకపోవడం చాలా సిగ్గుచేటు. మండలంలోని దాదాపు 450 పెండ్లిలు కాగా, అందులో 330 మంది కల్యాణలక్ష్మికి, షాదీముబారక్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకూ ఒక్క బాధితులకు రూ. లక్ష రాలేదు, తులం బంగారం ఇవ్వలేదని బాధితులు ప్రభుత్వంపైన మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్యాణ లక్ష్మి చెక్కులు ఎప్పటికప్పుడు వచ్చేవి అని మండల ప్రజలు గుర్తుచేశారు. ఇప్పుడు మండలానికి ఒక్క చెక్కు కూడా రాకపోవడం పట్ల అధికారుల నిర్లక్ష్యమా లేక ప్రభుత్వ వైఫల్యమా అని మండల ప్రజలు వాపోతున్నారు. పెండ్లిలు చేసిన తల్లిదండ్రులు అప్పులు చేస్తే కల్యాణ లక్ష్మి డబ్బుల వస్తాయని తులం బంగారం వస్తుందని బాధితులు ఎదురుచుస్తున్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవ చూపి మండలానికి చెక్కులతో పాటు తులం బంగారం వచ్చే విధంగా చూడాలాని బాధితులు కోరుతున్నారు.
కల్యాణ లక్ష్మి, షాదీమురక్ దరఖాస్తులు 330 వరకు వచ్చాయి. పెండింగ్లో ఉన్న కల్యాణ లక్ష్మి దరఖాస్తులను పరిశీలించి, పూర్తి విచారణ చేసి 175 దరఖాస్తులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి పంపించాను. మిగతా 100 దరఖాస్తులను ఆర్డీవోకు అందజేశా. చెక్కులు మాత్రం రాలేదు.
– వినయ్సాగర్, మాడ్గుల తహసీల్దార్
పెళ్లి చేసి సంవత్సరంపైగా అవుతున్నా కల్యాణలక్ష్మి చెక్కులు ఎందుకు ఇవ్వరు. లక్ష రూపాయలు ఇస్తా తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్సోళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. పేద కుటుంబాలకు ఆసరాగా ఉంటదని చెబితిరి.. నేటికీ చెక్కులు రాకపాయో. కేసీఆర్ ఉన్నపుడు కల్యాణలక్ష్మి చెక్కులు బాగా వచ్చేవి. ఇప్పుడు వస్తలేవు. తల్లిదండ్రులకు ఇబ్బంది చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అధికారులు, నాయకులు కల్యాణలక్ష్మి చెక్కు, తులం బంగారం వచ్చేట్లు చేయాలి.
– ఎగిరిశెట్టి తానయ్య, కలకొండ గ్రామం, మాడ్గుల మండలం.
మా కూతురు పెళ్లి చేసి సంవత్సరంన్నర అవుతుంది. ఇంత వరకూ చెక్కులు రాకపోవడం చాలా బాధకరం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కల్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు, తులం బంగారం ఇస్తానని మోసం చేసింది. వెంటనే ప్రభుత్వం స్పందించి కల్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వాలి.
– సురమల్ల నిర్మల, నాగిళ్ల, మాడ్గుల మండలం
నేను మా కూతురు పెళ్లి చేసి సంవత్సరం అయిపోయింది. షాదీముబారక్ కోసం దరఖాస్తు చేశాం. పెళ్లికి కొన్ని డబ్బులు అప్పులు తెచ్చినం. ఇంత వరకూ చెక్కులు రాలేదు. షాదీముబారక్ లక్ష, తులం బంగారం కోసం ఎదురుచూస్తున్నాం. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దయచూపి లక్ష రూపాయల చెక్కు, తులం బంగారం వచ్చేటట్లు చూడాలి.
– ఎండీ గౌస్య, పాతబ్రాహ్మణపల్లి, మాడ్గుల మండలం