రంగారెడ్డి, జూలై 12 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల పని కత్తి మీద సాముల మారింది. పంచాయతీల్లో వివిధ పనుల నిర్వహణకు నిధులు ఇవ్వని సర్కార్.. నిర్లక్ష్యం పేరుతో కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నది. మరోవైపు తమను పర్మినెంట్ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని.. తమతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నదని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంతో జిల్లాలో ఇద్దరు కార్యదర్శులపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. తలకొండపల్లి మండలంలోని గట్టుప్పలపల్లి పంచాయతీ కార్యదర్శి అనిత పారిశుధ్య నిర్వహణలో ట్రాక్టర్ వినియోగం.. తడి, పొడి చెత్త సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే, కందుకూరు మండలంలోని కొత్తగూడ కార్యదర్శి ఉమాదేవిపైనా వేటు వేశారు. ప్రభుత్వం నుంచి సక్రమంగా నిధులు రాకపోతే తాము ఎలా బాధ్యులమని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మరికొంతమంది కార్యదర్శులపైనా వేటు వేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
జిల్లాలో పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో పూర్తి బాధ్యత కార్యదర్శులపైనే పడింది. పంచాయతీల నిర్వహణకు ప్రభుత్వం నుం చి రూపాయీ రాకపోవడంతో గ్రామాల్లో పన్నులను వసూలు చేసి ట్రెజరీల్లో కార్యదర్శులే జమ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో గ్రామపంచాయతీల్లో చెత్త సేకరణకు ఉపయోగించే ట్రాక్టర్ల నిర్వహణ, పైపులైన్ల లీకేజీలు, వీధి దీపాలు, డ్రైనేజీ మరమ్మతులు, నర్సరీల నిర్వహణ వంటి వాటిని కార్యదర్శులే అప్పులు చేసి చేపట్టాల్సి వస్తున్నది.
ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి చేయిస్తున్నదని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 15 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులున్నారు. వీరు పంచాయతీల్లో అన్ని విధులు నిర్వహిస్తున్నా వారిని మాత్రం ప్రభుత్వం పర్మినెంట్ చేయడంలేదు. మరోవైపు 11 గంటలకే విధులకు హాజరై, డీఎస్ఆర్ ద్వారా యాప్లో ఫొటోలను అప్లోడ్ చేయాలన్న నిబంధనతో పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.