రంగారెడ్డి, జూలై 16 (నమస్తే తెలంగాణ) : ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్.. అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతన్నలు మళ్లీ గోస పడేలా మూడు గంటల కరెంట్ సరఫరా చాలంటూ తన కపట బుద్ధిని చూపించాడు. కాంగ్రెస్ పార్టీతో అన్నదాతలకు ఒరిగిందేమీ లేదు. అటువంటి కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని రైతులకు వివరించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమైంది. సోమవారం నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా రైతు వేదికల వద్ద రైతు సభలను నిర్వహించనున్నది. కరెంట్‌పై కాంగ్రెస్ దుర్మార్గాన్ని ఎండగట్టాలని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను రైతాంగం తీవ్రంగా ఖండిస్తూ దిష్టిబొమ్మలను దహనం చేసినా దుర్మార్గపు ధోరణి ఇంకా మారడం లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో పడ్డ కరెంట్ కష్టాలను తలచుకుంటే ఇప్పటికీ రైతుల కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని మండల, గ్రామ, మున్సిపల్, పట్టణ స్థాయి కమిటీలతో పాటు రైతు బంధు సమితుల ప్రతినిధులు.. ఈ సభల్లో కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించనున్నారు.
రైతులకు 3 గంటల విద్యుత్ సరఫరా చాలన్న కపట కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని రైతులకు తెలియజెప్పేందుకు రంగారెడ్డి జిల్లాలో సోమవారం నుంచి రైతు వేదికల వద్ద బీఆర్ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన సభలకు జిల్లా నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. కరెంట్‌పై కాంగ్రెస్ దుర్మార్గాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వారి మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో పది రోజులపాటు సభలను నిర్వహించేందుకు నేతలు సమాయత్తమవుతున్నారు. ఉచిత విద్యుత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను దహనం చేసి తీవ్రస్థాయిలో నిరసన తెలిపిన రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు.. తాజాగా నిర్వహించే సభల్లోనూ కాంగ్రెస్ వైఖరిని ఎండగడతామని పేర్కొంటున్నారు.
ప్రతి రైతు వేదికలో వెయ్యి మందికి పైగా రైతులతో..
ప్రతిపక్ష పార్టీగా రైతన్నల పక్షాన ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ రైతుల బతుకుతో చెలగాటమాడుతున్నది. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు రైతన్నలను బలిపీఠంపైకి ఎక్కించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. రైతు పక్షపాతిగా ఆదినుంచీ బాధ్యతగా ఉంటూ వస్తున్న సీఎం కేసీఆర్ రైతుల జీవితాలు ఆగం కాకుండా చేసేందుకు రైతాంగాన్ని అప్రమత్తం చేసే దిశగా కార్యాచరణను మొదలుపెట్టారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్‌పై యుద్దాన్ని ప్రకటించి రైతు వేదికల వద్ద సభల నిర్వహణకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రతి రైతు వేదికలోనూ వెయ్యి మంది రైతులకు తక్కువ కాకుండా సభకు తరలివచ్చేలా నేతలు సన్నద్ధం చేస్తున్నారు. రంగారెడ్డిలోని జిల్లాలోని మండల, గ్రామ, మున్సిపల్, పట్టణ స్థాయి కమిటీలతో పాటు రైతు బంధు సమితుల ప్రతినిధులు సమావేశాల్లో భాగస్వాములై కాంగ్రెస్‌పై నిరసన గళాన్ని వినిపించనున్నారు. రైతులు, వ్యవసాయ రంగం పట్ల కాంగ్రెస్ దుర్మార్గపు ధోరణిని ఆయా సభల్లో పాల్గొనే జిల్లా మంత్రితోపాటు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు తమ ప్రసంగాల ద్వారా ఎండగట్టనున్నారు. అలాగే.. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలను, బీఆర్ఎస్ పాలనలోని కరెంటు వెలుగులను రైతులకు సవివరంగా తెలుపనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేయడంతోపాటు రైతులకు కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణలు చెప్పేలా ఈ సమావేశాల త్వారా ఒత్తిడి తేనున్నారు.
కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా..
బొంరాస్‌పేట : రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని, కుట్రపూరిత మోసాలను ఎండట్టడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. రాష్ట్రంలోని అన్నదాతలు వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ అనవసరమని, మూడు గంటల విద్యుత్ సరఫరా చాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, దిష్టిబొమ్మల దహనాల కార్యక్రమం చేపట్టింది. అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆందోళనలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత కుట్రలను ప్రజలు, రైతుల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి సోమవారం నుంచి పది రోజులపాటు ప్రతి రైతు వేదిక వద్ద రైతు సభలు నిర్వహించాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి వికారాబాద్ జిల్లాలోని 99 రైతు వేదికల వద్ద రైతు సభల నిర్వహణకు బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. బీఆర్ఎస్ ఇస్తున్న మూడు పంటలు కావాలా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మూడు గంటల కరెంటు కావాలో రైతులు తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చారు. సోమవారం నుంచి రైతు వేదికల వద్ద నిర్వహించే రైతు సభల్లో కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు విధానాన్ని ఎండగట్టడమే కాకుండా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ తీరు గురించి రైతులకు సవివరంగా తెలియజెప్పడానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖం డిస్తూ తీర్మానాలు చేయనున్నారు. జిల్లాలోని కొడంగల్, వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల పరిధిలోని అన్ని రైతు వేదికల వద్ద రైతు సభల నిర్వహణకు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నరేందర్‌రెడ్డి, ఆనంద్, మహేశ్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి కృషి చేస్తున్నారు.
నేడు బొంరాస్‌పేట, దుద్యాల మండలాల్లో రైతు సభలు
ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ విధానాలను ఎండగట్టడానికి రైతు వేదికల వద్ద రైతు సభలను నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్ పిలుపులో భాగంగా సోమవారం బొంరాస్‌పేట మండలం రేగడిమైలారం, దుద్యాల మండలం పోలేపల్లి రైతు వేదికల వద్ద రైతు సభల నిర్వహణకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సభలకు పెద్దఎత్తున రైతులు తరలివచ్చేలా కృషిచేసి వారికి కాంగ్రెస్ హయాంలో విద్యుత్ సరఫరా తీరును, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సరఫరా తీరును వివరించనున్నారు.