తాండూరు, ఏప్రిల్ 26 : బంగారు తెలంగాణ సాధనకు బాసటగా నిలిచేందుకు, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అభివృద్ధి పాలనకు ఆకర్షితులై తాండూరు మున్సిపల్ 13వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్‌రెడ్డి 50 మందికిపైగా యువకులు, మహిళలతో బుధవారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్లో చేరడం అభినందనీయమన్నారు. యువకులు, ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా తాండూరు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. పార్టీ అభివృద్ధికి ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుల్లా పని చేయాలని సూచించారు. 13వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
బీఆర్ఎస్ బలోపేతానికి కలిసికట్టుగా ఉండాలి
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తాండూరు నియోజకవర్గానికి రూ.134 కోట్ల నిధులు తీసుకురావడంతో తాండూరు రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ బలోపేతానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గులాబీ శ్రేణులంతా రోహిత్‌రెడ్డితో కలిసి నడుస్తూ తాండూరు అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కులం పేరుతో, మతం పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మరాదని సూచించారు. తెలంగాణ అభివృద్ధి చెందినట్లు భారతదేశం అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ ప్రధాని కావాలన్నారు.
బీఆర్ఎస్లో చేరిన కౌన్సిలర్ వరాల శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్, తాండూరు అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చేస్తున్న కృషిని స్వయంగా చూసి బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 13వ వార్డు నుంచి అత్యధిక ఓట్లు బీఆర్ఎస్కే పడేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దీప, పట్టణ అధ్యక్షుడు నయీం, యూత్ అధ్యక్షుడు అనిల్బాండ్, నేతలు నర్సింహులు, హరిగౌడ్, సంతోష్, నరేందర్‌గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.