John Wesley | యాచారం, మార్చి4: ఫార్మా సిటీ భూ బాధితులకు న్యాయం జరిగే వరకూ సీపీఎం ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. యాచారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో ఫార్మా భూ బాధిత రైతులతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల ఆమోదం లేకుండా బలవంతంగా సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2200 ఎకరాల పట్టా భూమిని టిఎస్ఐఐసీ పేరు తొలగించి రైతుల పేర్లను ఆన్లైన్ రికార్డులో నమోదు చేయాలన్నారు. కోర్టులో ఫార్మాకు అనుకూలంగా ఉన్నామని చెప్పిన ప్రభుత్వం రైతులకు మాత్రం ఫార్మాసిటీ రద్దు చేస్తున్నామని మోసపూరిత మాటలు చెప్పడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఫార్మసిటీ రద్దు చేయాలని రైతుల పక్షాన పాదయాత్రలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చి పదవులు రాగానే రైతులను పూర్తిగా విస్మరించడం సమంజసం కాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాజీనామా చేయాల్సింది తన మంత్రి పదవి కోసం కాదని తనను నమ్ముకున్న రైతుల కోసమని చెప్పారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు రంగారెడ్డి కృషి చేయాలన్నారు. ఫార్మా భూ బాధిత రైతులకు సీపీఎం నిరంతరం అండగా ఉంటుందన్నారు. త్వరలో రైతుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు పోతామని, ప్రభుత్వం స్పందించకపోతే సీఎం కార్యాలయాన్ని రైతులతో కలిసి ముట్టడిస్తామని ఆయన పేర్కొన్నారు.
యాచారం, కందుకూరు మండలాలకు చెందిన ఫార్మ బాధిత రైతులతో త్వరలో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తామని పేర్కొన్నారు. యాచారం నుంచి అసెంబ్లీ వరకు రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహించి ఫార్మసిటీ అంశంపై ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, గ్యాస్ సబ్సిడీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గృహ జ్యోతి పథకం అర్హులందరికీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఆసరా పింఛన్ వెంటనే పెంచాలన్నారు. ధరణి భూ సమస్యలను, కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికై త్వరలో సిపిఎం పోరుబాట నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మదుసూదన్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, సిపిఎం నాయకులు బ్రహ్మయ్య, పెద్దయ్య, జగన్, తావునాయక్, సత్తయ్య, భూషణ్, యాదయ్య, జంగయ్య, ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు కానమోని గణేష్, అచ్చిరెడ్డి, బర్ల మల్లేష్, రైతులు, గ్రామస్తులు, యువకులు ఉన్నారు.