Jawahar Nagar | జవహర్‌నగర్, మార్చి 13: జవహర్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రపంచ రికార్డు సాధించారు. ఇటీవల హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్లాంక్ విన్యాసం పోటీలను నిర్వహించగా జవహర్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన త్రిశాంక్ విరామం లేకుండా ఒక నిమిషం పాల్గొని అద్భుత విజయం సాధించారు.
ఈ మేరకు జవహర్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం తైక్వాండో అకాడామీ మాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుడు మహ్మద్ అజమోహినుద్ధిన్ సమక్షంలో సర్టిఫికేట్, మెడల్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా తైక్వాండో మాస్టర్ రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో మెలగాలని, తైక్వాండో నిత్యజీవితంలో భాగం చేసుకోవలని సూచించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల 7వ తరగతికి చెందిన త్రిశాంక్ పోటీల్లో ప్రత్యేక ప్రతిభ కనబర్చడం అభినందనీయమని అన్నారు. వైష్ణవి, గీతిక ఎల్లొవన్ బెల్ట్‌లు సాధించారు.