కొడంగల్, నవంబర్ 14 : కొడంగల్‌కు మంజూరైన అభివృద్ధి పనులను ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఊరుకోవద్దని.. సమిష్టిగా పోరాడుదామని కేడీపీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చిట్లపల్లి, ఖాజాఅహ్మద్‌పల్లి గ్రామాల్లో కేడీపీ జేఏసీ నాయకులు పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. కేడీపీ జేఏసీ కో-కన్వీనర్లు సురేశ్‌కుమార్, మెంకటయ్య తదితరులు మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే సీఎం కావడంతో కొడంగల్ అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతుందని భావించామని.. కానీ, ప్రస్తుతం చూస్తే పరిస్థితి దారుణంగా ఉన్నదన్నారు.
కొడంగల్‌కు మంజూరైన మెడికల్, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలలతోపాటు సమీకృత గురుకులాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి అప్పాయిపల్లి గ్రామంలో పంటలు పండే తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చామని.. అభివృద్ధి పనులు ఇతర ప్రాంతానికి వెళ్తే తాము భూములతోపాటు ఉపాధి అవకాశాలను కోల్పోయి.. రోడ్డున పడుతామన్నారు. మంజూరైన విద్యాలయాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలను కొడంగల్ ప్రాంతంలోనే ఏర్పాటు చేసేలా ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పోరాడుదామని.. ఇప్పుడు కాకపోతే.. మరోసారి పోరాడడం సాధ్యం కాదని.. మన భూములను తీసుకుని మనల్నే మోసం చేస్తారా..? మండిపడ్డారు. కార్యక్రమంలో కేడీపీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.