రంగారెడ్డి, మే 15(నమస్తే తెలంగాణ): ఇంటర్లో అనుత్తీర్ణులైన వారికోసం ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నది. ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నది. సప్లిమెంటరీ ఫలితాల్లోనూ మెరుగైన ఉత్తీర్ణతను సాధించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. అనుత్తీర్ణులంతా ఉత్తీర్ణులయ్యేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు.
గతంతో పోలిస్తే ఈసారి ఇంటర్ ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మొదటి సంవత్సరంలో 71.7 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో 77.63 శాతం ఉత్తీర్ణతను సాధించి జిల్లా తృతీయ స్థానాన్ని దక్కించుకున్నది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 33,721 మంది బాలికలు హాజరవగా.. 25,879(76.74 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 37,576 మంది హాజరుకాగా..23,516(67.18 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 30,900 మంది బాలికలు హాజరుకాగా..25,204(78 శాతం)మంది ఉత్తీర్ణతను సాధించారు. బాలురు 33,859 మంది హాజరుకాగా.. 25,069(74.04 శాతం)మంది పాస్ అయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించగా.. నిర్దేశిత రుసుముతో దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో ప్రారంభం కానున్న సప్లిమెంటరీ ఫలితాల్లోనూ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు.
సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న ప్రభుత్వ కళాశాలలకు చెందిన విద్యార్థులపై ఇంటర్ విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలకు సన్నద్ధ్దం చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కొనసాగుతుండడంతోపాటు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో విద్యార్థులకు పాఠ్యాంశాల వారీగా అధ్యాపకులతో ఆన్లైన్ బోధన నిర్వహిస్తున్నారు. ఫెయిల్ అయిన సబ్జెక్టులపై ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు.
సందేహాలు ఉంటే నివృత్తి చేస్తున్నారు. విద్యార్థులకు సంబంధించి వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేయడంతో చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు అధ్యాపకులంతా ఎన్నికల విధులను నిర్వర్తించడంతో ఆన్లైన్ బోధనకు ఆటంకం కలిగింది. ఎన్నికలు పూర్తవ్వడంతో ఇక నుంచి పకడ్బందీగా బోధన తరగతులను నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సిద్ధ్దమవుతున్నారు.
ఇంటర్లో జిల్లాలో ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా సప్లిమెంటరీ పరీక్షల్లోనూ ఉత్తమ ఫలితాలను సాధించేందుకు ఆన్లైన్లో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా.. ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. ఎన్నికల వల్ల ఈ ప్రక్రియకు కొంత బ్రేక్ పడింది. ఇక నుంచి పకడ్బందీగా ఆన్లైన్ తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకుంటాం. సప్లిమెంటరీ పరీక్షల్లోనూ ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతాం.
– శ్రీదేవి, డీఐఈవో, రంగారెడ్డి జిల్లా