ఇబ్రహీంపట్నం, జూన్ 8 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది. విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెరుగైన వసతులను కల్పించడం ద్వారా ప్రభుత్వ బడులకు ఆదరణ పెద్ద ఎత్తున పెరిగి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో పెద్దఎత్తున చేరారు. జిల్లావ్యాప్తంగా పేద విద్యార్థుల ముంగిటకే కార్పొరేట్ విద్యను గత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చి వారికి కొండంత అండగా నిలిచింది. అనేక సంస్కరణలు చేపట్టి విద్యావ్యవస్థను గాడిలో పెట్టడంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉత్తీర్ణత శాతం కూడాగణనీయంగా పెరిగింది.
ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం, రెండు జతల స్కూల్ యూనిఫాం, టై, బెల్టులు, షూలతోపాటు పుస్తకాలు ఇలా అన్ని రకాల వసతులను పేద విద్యార్థులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసింది. కాని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు బడులపై చిన్నచూపు చూస్తున్నది. సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం చేస్తున్నది. విద్యార్థులకు అల్పాహారాలు లేకుండానే పాఠశాలలను నడుపుతున్నారు. దీంతో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలనే ఉద్దేశంతో శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. దీంతోనైనా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయా అంటే.. ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నతాశయంతో చేపట్టిన బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో వేలాదిమంది బడీడు పిల్లలను బడుల్లో చేర్పించగలిగారు. దీంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సంవత్సరం కూడా చేపడుతున్న్న బడిబాట కార్యక్రమం ద్వారా ప్రవేశాలు పెరుగతాయా అనేది సందిగ్ధంగా మారింది. గతేడాది నుంచి విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. ప్రస్తుతం బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకొంటున్నందున విద్యార్థులు ప్రభుత్వ బడులను మరిచి ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాల్లో తూతూమంత్రంగా బడిబాటను నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో చేరిన విద్యార్థులు సర్కారు బడుల్లో నెలకొన్న సమస్యల కారణంగా ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను ఎంతో బలోపేతం చేసినప్పటికీ ఆ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.
– పిట్టల నిరంజన్
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించడంలేదు. విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని నెరవేర్చడంలేదు. ప్రభుత్వ విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వర్యీం చేస్తున్నది. పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నందున అన్ని రకాల వసతులు కల్పించాలి.
– శ్రీనాథ్, విద్యార్థి సంఘం నాయకుడు