Indiramma House Scheme | తాండూరు రూరల్, మే 2 : తాండూరు మండలం, చెన్గేష్పూర్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. బెస్మెంట్ పూర్తయిన ఇండ్లకు బిల్లులు అధికారులు చెల్లించడం లేదు. బిల్లులు చెల్లించేందుకు అధికారులు కొర్రీలు పెడుతున్నారని లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లబ్దిదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి 144 ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు కేవలం నాలుగు ఇండ్లు మాత్రమే బెస్మెంట్ వరకు పూర్తయ్యాయి. తమకు ఉన్న పురాతన ఇండ్లను కూల్చి పనులు మొదలెట్టారు. లబ్దిదారులు అద్దె ఇండ్లలో ఉంటున్నారు. గతంలో ఇంటి నిర్మాణం ఎలాగైనా కట్టున్నా, బిల్లులు చెల్లిస్తామని అధికారులు చెప్పారు. తీరా కట్టుకుంటున్న క్రమంలో హౌజింగ్ అధికారులు కొర్రీలు పెడుతున్నారని లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
400 గంజాల నుంచి 600 గజాలలోపు మాత్రమే, ఇల్లు కట్టుకోవాలని హౌజింగ్ అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే బిల్లులు రావని అంటున్నారు. దాంతో లబ్దిదారులు ఇండ్లు కట్టుకోవాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడిపోయారు. ప్రభుత్వం బెస్మెంట్ పూర్తయిన వెంటనే లక్ష రూపాయాలు చెల్లిస్తామన్నారు. గ్రామంలో కుర్వ మమత, గౌరమ్మ, అమృతమ్మలు 600ల గజాల్లో బెస్మెంట్ పూర్తి చేశారు. వీరికి ఇప్పుడు బిల్లులు చెల్లించం సాధ్యపడని అంటున్నారు. కేవలం కవిత, మాణేమ్మలకు మాత్రమే బెస్మెంట్ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వ అధికారులు ఆమోదం తెలిపారు. మిగతా వారి బిల్లులు చెలించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.
రూ.3 లక్షల అప్పు చేశాం : కుర్వ మమత
ఇందిర్మ ఇల్లు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల అప్పు చేశాం. బంగారం కుదువ పెట్టి రూ.లక్ష, పొదుపు సంఘంలో లక్ష, ప్రైవేట్‌గా మరో లక్ష అప్పు తెచ్చాం. మొత్తం రూ.3 లక్షల అప్పు చేసి, బెస్మెంట్ పూర్తి చేశాం. బిల్లు చెల్లించేందుకు అధికారులు కొర్రీలు పెడుతున్నారు. 764 గజాల్లో బెస్ మెంట్ కట్టారని అధికారులు తమకు రావాల్సిన లక్ష రూపాయల బిల్లు చెల్లించడంలేదు.
ఉన్న ఇల్లు కూల్చాం : కుమ్మరి రాములు
ఉన్న ఇల్లు కూల్చాం. ఇందిరమ్మ ఇల్లు తన కూతురి పేర మంజూరైంది. బెస్మెంట్ వరకు పూర్తి చేశాం. బిల్లు కోసం అధికారులను కోరితే, నిబంధనల ప్రకారం కట్టలేదు. 400-600 గజాలకంటే ఎక్కువగా కట్టారని మీకు బిల్లులు రాదని అంటున్నారు. తాము ఉన్న ఇల్లు కూల్చి, అద్దె ఇంట్లో ఉంటున్నాం. బిల్లు రాదు అంటే ఎలా అని లబ్దిదారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.