రంగారెడ్డి, ఆగస్టు 15 (నమస్తేతెలంగాణ) : ప్రభుత్వం ఔటర్చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో భూముల మార్కెట్ విలువ పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నది. దీంతో జిల్లా పరిధిలో ఔటర్చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లోని ప్రధాన ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ భారీగా పెరుగనుంది. ఈనెల 18తర్వాత భూముల మార్కెట్ విలువలు పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. దీంతో జిల్లా పరిధిలోని పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్, బండ్లగూడ, తుర్కయంజాల్ తదితర మున్సిపాలిటీల్లో మార్కెట్ విలువలు పెరుగనున్నాయి. దీంతో ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులతో సబ్రిజిస్ట్రార్లు సమన్వయం చేసుకుంటూ విలువల పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు మూడురోజుల క్రితం ఔటర్చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో ప్రధానంగా డిమాండ్ ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ఎంత పెంచాలన్న దానిపై ఇప్పటికే అధికారులు అంచనాకు వచ్చారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. నివేదిక అందగానే జీవో జారీకానుంది.
ఔటర్చుట్టూ ప్రత్యేక ఫోకస్..
నగరచుట్టూ విస్తరించి ఉన్న జిల్లాలోని ఔటర్చుట్టూ ఉన్న మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు భారీగా పెంచేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా ఔటర్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న హయత్‌నగర్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, నార్సింగి, మణికొండ వంటి జీహెచ్ ఎంసీ ప్రాంతాల్లో ఉన్న జిల్లాకు చెందిన మండలాల్లో కూడా మార్కెట్ విలువ భారీగా పెంచే యోచనలో ఉంది.
కొనుగోలు దారులపై అదనపు భారం..
భూముల మార్కెట్ విలువ పెంచితే రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా భారీగా పెరుగనున్నాయి. ఈ భారం కొనుగోలు దారులపై పడనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపా రం భారీగా తగ్గింది. ఈ పెంపు నిర్ణయంతో మరింత తగ్గే అవకాశమున్నట్లు పలువురు వాపోతున్నారు.