ఇటీవలే జార్జియాలో ‘వారణాసి’ చిత్రం తాలూకు మేజర్ షెడ్యూల్ పూర్తయింది. అక్కడ రామాయణం నేపథ్య కీలక ఘట్టాలను తెరకెక్కించినట్లు తెలిసింది. మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా విడుదలకానుంది. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన తాజా అప్డేట్ను చిత్ర కథానాయిక ప్రియాంకచోప్రా తన సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది. ఆమె తాజా హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో ప్రియాంకచోప్రా అభినయాన్ని ప్రశంసిస్తూ మహేష్‌బాబు ఓ పోస్ట్ పెట్టారు. దీనికి ప్రియాంక చోప్రా ‘థాంక్యూ మై ఫ్రెండ్.. త్వరలో అంటార్కిటికాలో కలుద్దాం’ అని రిైప్లె ఇచ్చింది.
దాంతో ‘వారణాసి’ తదుపరి షెడ్యూల్‌పై అప్డేట్ వచ్చిందంటూ అభిమానులు ఈ న్యూస్‌ను షేర్ చేస్తున్నారు. భూమిపై అత్యంత శీతల ప్రాంతమైన అంటార్కిటికాలో షూటింగ్ జరపడం కష్టసాధ్యంగా భావిస్తారు. రవాణా సౌకర్యాలతో పాటు అక్కడ వసతి ఏర్పాట్లు చేసుకోవడం సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. అందుకే కొన్ని హాలీవుడ్ సినిమాలు తప్ప ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా అక్కడ షూటింగ్ జరుపుకోలేదు. తొలిసారి ఈ ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. భారతీయ పురాణాలు, టైమ్ ట్రావెల్ కలబోసిన సాహసగాథగా అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.