రఘునాథపాలెం, మార్చి 3: ఖమ్మం భూదాన్ భూముల్లో ఇళ్లను కోల్పోయి వందలాది మంది పేదలు కుటుంబాలతో అల్లాడుతుంటే పట్టించుకోవాల్సిన మంత్రులు కన్పించకుండా పోవడంపై బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు మండిపడ్డారు. ‘పేదల ఇళ్ల కూల్చివేతలో మీ ప్రమేయమే లేకుంటే వచ్చి బాధితులను పరామర్శించండి.’ అంటూ సవాల్ విసిరారు. ఎక్కడో ఉండి ప్రకటనలు చేయడంకాదని, అసలు మరెక్కడో, మీ అడ్రస్ ఎక్కడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం టీటీడీసీ, అంబేద్కర్ భవనాల్లో ఆశ్రయం పొందుతున్న భూదాన్ బాధితులకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదానం జరిగింది.
ఎమ్మెల్సీ తాతా మధు హాజరై పేదలకు భోజనం వడ్డించారు. రెండురోజులుగా పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవలను పరిశీలించి.. భోజనాలు వడ్డిస్తున్న బీఆర్ఎస్ నేతలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకొని ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల గుండెల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గునపాలు దింపిందని మండిపడ్డారు. జిల్లా మంత్రుల ఆదేశాలతో పేదలకు నిలువ నీడ లేకుండా చేసిన అధికారులు.. ఖమ్మంలోని టీటీడీసీ, అంబేద్కర్ భవనాలకు తీసుకొచ్చి చెట్టుకొకరు పుట్టకొకరుగా పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వసతుల్లేకుండా అల్లాడుతున్న పేదలకు కనీసం భోజనం పెట్టాలనే సోయి లేకుండా పోయిందని విమర్శించారు.
ఇక్కడ వారి అవస్థలను చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ సేవా కార్యక్రమాలను చేపడుతోందన్నారు. గూడు కోల్పోయిన నాటి నుంచి మేమున్నామనే భరోసాను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితుల తరఫున న్యాయ పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ లీగల్ హైకోర్టు వరకు వెళ్లిందని గుర్తుచేశారు. భూదాన్ బాధితుల విషయంలో తప్పు చేశామనే భావనలో కాంగ్రెస్ ఉన్నట్లు పేర్కొన్నారు. పేదలకు అన్యాయం చేసిన ప్రభుత్వాలు నిలబడిన చరిత్ర లేదని గుర్తుచేశారు. బాధితుల తరఫున బీఆర్ఎస్ నిలిచి పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, రవికిరణ్, బచ్చు విజయ్‌కుమార్, కొల్లు పద్మ, షకీనా, తీగల సతీష్, బోజెండ్ల రామ్మోహన్, ఆరెంపుల వీరభద్రం, ఎర్రా అప్పారావు, వీరేందర్, వెంకట్, ఉస్మాన్, వెంకన్న, తిరుమల్, ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు.