నాని ‘ది ప్యారడైజ్’ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘ఆయా షేర్’ పాటకు మంచి స్పందన లభిస్తున్నది. సోషల్‌మీడియా వేదికల్లో ఈ పాట ట్రెండ్ అవుతున్నది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఆగస్ట్ 21న విడుదలకానుంది. ఈ సందర్భంగా ‘ఆయా షేర్’ పాట కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు.‘దసరా’ సినిమాకు తాను ప్రేమ్క్ష్రిత్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశానని, అప్పటి నుంచే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి ట్రావెల్ అవుతున్నానని, తన ప్రతిభపై నమ్మకంతో ఆయన ఈ సినిమాలో డ్యాన్స్ మాస్టర్‌గా అవకాశమిచ్చారని చెప్పారు.
‘ఈ సినిమాలో నాని ఇప్పటివరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రో సాంగ్ చాలా కొత్తగా ఉండాలని దర్శకుడు శ్రీకాంత్ నాతో చెప్పారు. ఆయన సూచనల ప్రకారమే కొరియోగ్రఫీ చేశాను. ఈ పాటలోని హుక్ స్టెప్కోసం మూడు రోజులు రిహార్సల్స్ చేశాం. నాని రోజూ మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేశారు. ఆయన కష్టం స్క్రీన్‌మీద కనిపిస్తుంది’ అన్నారు. ‘ప్యారడైజ్’లో ఓ కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారని, కథలోని ఎమోషన్స్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని సుధన్ తెలిపారు. ‘ఆయా షేర్’ తర్వాత చాలా మంది తనకు ఫోన్ చేసి తమ సినిమాలకు పనిచేయాలని అడుగుతున్నారని, చెన్నై నుంచి కూడా కాల్స్ వస్తున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.