రంగారెడ్డిజిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో అన్నదాతల అంగీకారం లేకుండానే సర్కారు బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని, తమ జీవనాధారమైన భూములు తీసుకుంటే తాము రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వేడుకుంటున్నా అధికారులు వినిపించుకునే పరిస్థితి లేదు. బలవంతంగా తమ భూముల్లో పనులు చేపట్టడానికి వచ్చిన అధికారులను అడ్డుకుంటే అన్నదాతలపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో రంగారెడ్డిజిల్లాలో భూ బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ముఖ్యంగా జిల్లా పరిధిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన ప్రభుత్వ భూములను కాకుండా కాంగ్రెస్ సర్కారు రైతుల నుంచి బలవంతంగా పట్టా భూములను కూడా సేకరించడానికి సిద్దమైంది. పట్టా భూములను తీసుకోవద్దని తాము భూములివ్వడానికి సిద్ధంగా లేమని, అయినప్పటికీ తమ భూములను తమకు తెలియకుండానే టీజీఐఐసీ పేర బదలాయించి ఆన్లైన్లో తమ పేర్లను తొలగించడంపై యాచారం మండలంలోని పలు గ్రామాల అన్నదాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఏకపక్ష చర్యలను నిరసిస్తూ ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తీసుకున్నారు. అయినప్పటికీ పోలీసు అండదండలతో రెవెన్యూ అధికారులు పట్టా భూములను సైతం తీసుకోవడానికి సిద్ధమయ్యారు. పట్టా భూముల్లోకి రాకుండా అడ్డుకునేందుకు వెళ్తున్న రైతులపై అక్రమ కేసులు కూడా బనాయిస్తున్నారు.
రంగారెడ్డి, జూన్ 3 (నమస్తే తెలంగాణ): జిల్లా పరిధిలో ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్‌రోడ్డు వరకు చేపట్టే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, అలాగే.. శంషాబాద్ నుంచి కొడంగల్ వరకు చేపట్టే మరో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం రైతుల నుంచి సర్కారు బలవంతంగా భూములను సేకరిస్తున్నారు. ఇక్కడ కూడా అన్నదాతలు భూసేకరణను అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ పోలీసుల జోక్యంతో రైతులు అధికారులకు గోడును వినిపించుకునే పరిస్థితిలో లేరు. దీంతో జిల్లాలో భూ బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
కోర్టు స్టే ఉన్నా పట్టించుకోని అధికారులు
యాచారం మండలంలోని తాటిపర్తి, కుర్మిద్ద, నానక్‌నగర్, మేడిపల్లి గ్రామాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ కోసం 4500 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించింది. మరో 2,600 ఎకరాల పట్టా భూములను కూడా సేకరించేందుకు గత సర్కారు సిద్ధమవడంతో అన్నదాతలు వ్యతిరేకించటంతో ఆ ప్రక్రియ నిలిపివేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పట్టా భూములున్న రైతుల జోలికి వెళ్లబోమని హామీ ఇచ్చింది. అప్పటికే పట్టా భూముల అన్నదాతలకు సంబంధించిన 2,600 ఎకరాలను వారికి తెలియకుండానే టీజీఐఐసీకి బదలాయించి ఆ పరిహారాన్ని అథారిటీలో జమచేసింది.
కాని, పరిహారం మాత్రం రైతులు తీసుకోవడానికి ముందుకు రాలేదు. తమ పట్టా భూములు తీసుకోవడానికి తాము అంగీకరించబోమని.. పరిహారం కూడా తీసుకోలేదని అన్నదాతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు రైతుల పక్షాన స్టే ఇచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టా భూములను కూడా తీసుకుని ఫార్మాసిటీలో కలపాలని నిర్ణయించింది. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే పట్టా భూములను తీసుకోబోమని, భూములను తిరిగి రైతుల పేర్లపై ఆన్లైన్లో చేర్చుతామని హామీ ఇచ్చింది. ఎన్నికల అనంతరం ఆ హామీని విస్మరించింది. దీంతో బాధిత అన్నదాతలు అనేక రకాలుగా పోరాటం చేస్తున్నా వారి గోడును ఎవరూ వినిపించుకోవడంలేదు.
బాధితుల్లో భరోసా నింపని సర్కారు
వివిధ ప్రజా అవసరాల కోసం జిల్లాలో చేపట్టిన భూసేకరణ అన్నదాతల్లో సరైన భరోసా నింపడంలో ప్రభుత్వం విఫలమైంది. బాధిత రైతులకు ఇచ్చే పరిహారంపై సర్కారు సరైన స్పష్టత ఇవ్వడంలేదు. జిల్లాలో భూముల విలువ విపరీతంగా పెరిగింది. కాని, పెరిగిన భూముల ధరలకనుగుణంగా ప్రభుత్వం పరిహారం ఇవ్వడంలేదు. దీంతో బాధిత అన్నదాతలు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. సర్కారు మాత్రం రైతుల గోడు వినిపించుకోకుండా బలవంతంగా భూసేకరణకే సిద్ధమైంది. అన్నదాతలకు పరిహారం అందించడంలో ప్రభుత్వం సరైన భరోసా ఇవ్వాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇప్పటికే డిమాండ్ చేశారు. జిల్లాలో భూసేకరణ ద్వారా భూములు కోల్పోతున్న రైతులకు సర్కారు స్పష్టమైన హామీ ఇచ్చి.. అలాగే, పరిహారాలూ తమ డిమాండ్ మేరకు చెల్లించాలని అన్నదాతలు కోరుతున్నారు.
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం బలవంతపు భూసేకరణ
జిల్లా పరిధిలో ఫ్యూచర్‌సిటీ కోసం 330 అడుగుల వెడల్పుతో 41 కిలోమీటర్ల మేర చేపడుతున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం సుమారు ఐదువందల ఎకరాలకు పైగా పట్టా భూములను ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, కడ్తాల్, ఆమనగల్లు తదితర మండలాల్లోని రైతులు కోల్పోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఔటర్ రింగ్‌రోడ్డు ఎగ్జిట్ నం.13 నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు వరకు భూసేకరణ చేపడుతున్నారు. భూసేకరణ ద్వారా అన్నదాతల విలువైన పట్టా భూములూ కోల్పోతున్నారు.
తమ భూములను ఇచ్చేది లేదంటూ రైతులు ఎక్కడికక్కడే అధికారులకు ఎదురుతిరుగుతున్నారు. అలాగే, శంషాబాద్ మండలంలోని ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి కొడంగల్ వరకు చేపడుతున్న మరో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం కూడా రైతులు పట్టా భూములు కోల్పోవల్సి వస్తున్నది. ఈ భూములు కూడా మార్కెట్లో అత్యంత విలువైనవి కాబట్టి, తాము భూములిచ్చేది లేదని అన్నదాతలు అడ్డుకుంటున్నప్పటికీ అధికారులు బలవంతపు భూసేకరణ చేస్తున్నారు. భూసేకరణ కోసం వెళ్లిన ప్రతి గ్రామంలోని రైతులు అధికారుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.