బీజింగ్ : రిమోట్లు, స్విచ్ బటన్ల ద్వారా పరికరాలను నియంత్రించడం అందరూ చేసేదే. అయితే పక్షవాతంతో శరీరం పూర్తిగా స్తంభించిన తాను ఇతరుల్లా చేయలేనని అనుకున్న చైనాకు చెందిన వాంగ్ నింగ్ అనే దివ్యాంగుడు తన భార్యతో కలిసి ఏకంగా మనసుతోనే నియంత్రించేలా వాటిని తయారు చేశాడు. తొలుత తాను వాడే వీల్‌చైర్‌నే తయారు చేశాడు. వారు కేవలం 48 గంటల్లో తయారు చేసిన నమూనాకు టెక్నాలజీ పోటీల్లో ప్రథమ బహుమతి లభించింది.
వాంగ్ పుస్తకాలు, ఇంటర్నెట్ సహాయంతో కృత్రిమ మేధ, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీని స్వయంగా నేర్చుకున్నాడు. దీంతో తన మెదడు నుంచి వచ్చే సంకేతాలు, ముఖం కండరాలతో వీల్‌చైర్ పనిచేసేలా చేశాడు. వాంగ్ తర్వాత తన సాంకేతికతను మరింత అభివృద్ధి చేసి ఇప్పుడు ఇంట్లోని లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు కూడా మనసుతో ఇచ్చే ఆదేశాలతో పనిచేయిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు.