జగిత్యాల/పెద్దపల్లి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ)/రామడుగు : కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కాళేశ్వరం గుడి కాదని, మేడిగడ్డ బరాజ్‌కు చెందిన రెండు పిల్లర్లు కాదని, కాళేశ్వరం అంటే.. ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు అని, తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేయడంతోపాటు ప్రజలందరికి అమృతధారను అందించే అద్భుత నిర్మాణమని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం అభివర్ణించింది. కాళేశ్వరం కూలిపోలేదని, అది రాష్ట్ర జలజీవధారగా నిలిచిందనడానికి కోటిలింగాల వద్ద నిలిచి ఉన్న బ్యాక్‌వాటర్, నంది మేడారం, రామడుగు మండలం గాయత్రీ పంప్‌హౌస్‌ల నుంచి ఉబికి వస్తున్న గోదావరి జలాలే అందుకు సాక్ష్యమని స్పష్టంచేసింది. నిన్నామొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని, నీరు ఎత్తిపోసే పరిస్థితి లేదని చెప్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఏర్పాటు చేసిన నంది, గాయత్రీ పంప్‌హౌస్‌లను ప్రారంభించి నీటిని మిడ్‌మానేరులోకి, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఎగువ వరద కాలువల్లోకి తరలిస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు మరోసారి తెలియజేయడంతోపాటు, సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన భజన బృందానికి కనువిప్పు కలిగించేందుకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, సుంకె రవిశంకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, దావ వసంతతో కూడిన బీఆర్ఎస్ ప్రతినిధులు ఆదివారం కోటిలింగాల వద్ద ఎల్లంపల్లి బ్యాక్ వాటర్‌ను, ధర్మారం మండలం నందిమేడారం వద్ద కాళేశ్వరం ప్యాకేజీ 6లోని నంది మోటర్లను, రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌ను సందర్శించి కాళేశ్వరం ప్రాజెక్టు ఆశయాలను, లక్ష్యాలను, నిర్మాణ శైలిని, వాటి ప్రభావాన్ని ప్రపంచం ముందు మరోసారి ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
గోదావరి జలాలను బీళ్లకు మళ్లించింది కేసీఆర్ : జీవన్‌రెడ్డి
గోదావరి జలాలను రైతుల పొలాల్లోకి తరలించి, రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసింది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కొనియాడారు. కోటిలింగాల వద్ద ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు సాగు, తాగు నీటి కష్టాలు రాకుండా చూడాలన్న ఆశయంతో కేసీఆర్ బహుళార్థ సాధకమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినట్టు చెప్పారు. నదీ జలాలను ఎలా వాడుకోవాలో తెలిసిన గొప్ప నేత కేసీఆర్ అని ప్రశంసించారు. కాళేశ్వరం నుంచి కాదు.. ఎల్లంపల్లి నుంచే నీళ్లు ఇస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధిలేదని అన్నారు. తమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం చేపట్టి 60 టీఎంసీల నీటిని తరలిస్తామని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వచ్చిందని, పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
సీఎం, మంత్రులకు అవగాహనే లేదు: వినోద్‌కుమార్
కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవగాహన లేదని, సదస్సు పెట్టి వారికి అవగాహన కల్పించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సూచించారు. కడెం, ఎల్లంపల్లి జలాశయాలు మినహా ఇప్పటివరకు తెలంగాణలో ఎక్కడా నీళ్లు లేవని, పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో తాగు నీటికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల నుంచి భారీగా వరద వెళ్తుందని, అక్కడి గేట్లను మూసి వరదను పరీక్షించాలని రేవంత్‌రెడ్డికి సూచించారు.
తమ్మిడిహెట్టి ప్రతిపాదనలకే పరిమితం: కొప్పుల
కాంగ్రెస్ ప్రభుత్వం 2014కు ముందు అధికారంలో ఉన్న సమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గేట్లు పెడితే రాయపట్నం వద్ద కొత్త వంతెనను నిర్మించాల్సి వస్తుందని, ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందని కనీసం ఆ ప్రాజెక్టుకు గేట్లు సైతం బిగించలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సరిపోతది కదా? మరీ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఇప్పుడు తమ్మిడిహెట్టి దగ్గర బరాజ్ కట్టి తీరుతమని ఎందుకు అంటున్నారో ప్రజలకు వివరించాలని అన్నారు. తమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం అంశాన్ని ప్రతిపాదనలకే పరిమితం చేశారని, అక్కడ తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ.. కాళేశ్వరంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలకు వాస్తవాలు కనిపిస్తున్నాయని తెలిపారు.
ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు: గంగుల
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై అవగాహన లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని మంత్రులకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. ప్రపంచం గర్వించదగిన రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, స్వదేశీ పరిజ్ఞానంతో బాహుబలి మోటర్లను ఏర్పాటు చేసిన ఘనత కేవలం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. రామడుగు మండలంలోని గాయత్రీ పంప్‌హౌస్‌ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రపంచ సాగునీటి రంగంలో అత్యంత లోతులోంచి నీటిని తోడే మోటర్లను రామడుగు మండలంలోని గాయత్రీ పంప్‌హౌస్‌లో ఏర్పాటు చేశారని, సుమారు 115 మీటర్ల భూగర్భంలోంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తాయని చెప్పారు.