హైదరాబాద్ అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : ‘ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, ఫలితాలకు నేను బాధ్యుడిని కాను.. గెలుపోటములకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని జిల్లా మంత్రులు, ఇన్చార్జ్ మంత్రులే పూర్తి బాధ్యత వహించాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని సమాచారం. త్వరలో జరుగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను ముఖ్యమంత్రి పూర్తిగా మంత్రులపైకే నెట్టేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు, గెలుపోటములకు తనను బాధ్యుడిని చేయొద్దని ఆయన నిర్ద్వంద్వంగా తేల్చిచెప్పినట్టు సమాచారం.
రెడ్లకు టికెట్లపై వాడీవేడి చర్చ
ఇక ఏఐసీసీ ఇప్పటికే మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి సామ రామ్మోహన్‌రెడ్డిని, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థా నానికి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించడం కూడా క్యాబినెట్లో చర్చనీయాంశమైనట్టు తెలిసింది. ఒకే వర్గం నుంచి ఇద్దరిని నిలబెడితే బీసీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉన్నదని కొందరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అయి తే బీసీల ప్రభావం ఎన్నికలపై పెద్దగా ఉండబోదని, ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లోనే అది స్పష్టమైందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
దీనిపై ఒక బీసీ మంత్రి తీవ్రంగా స్పందిస్తూ, ఇవి సాధారణ పంచాయతీ ఎన్నికలు కావని, పట్టభద్రుల ఎన్నికలని, వారు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని బదులిచ్చినట్టు తెలిసింది. దీనికి సీఎం స్పందిస్తూ, బీసీల నుంచి ఎకడైనా అసంతృప్తి వ్యక్తంచేస్తే సంబంధిత జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ స్థానిక నాయకత్వమే సమన్వయంతో పరిషరించుకోవాలని సూచించినట్టు సమాచారం.
మరోవైపు ఎన్నికల ముంద స్తు వాతావరణంపై పార్టీ చేపట్టిన అంతర్గత ఫ్లాష్ సర్వేల వ్యవహారం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఇటీవలి సర్వే ఫలితాల్లో పార్టీకి కనీసం 32శాతం ఓట్లు కూడా రావడం లేదని తేలిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో మొత్తం బాధ్యతను, ఫలితాలను మంత్రులపైకి నెట్టడం ఎంతవరకు సమంజసమని దక్షిణ తెలంగాణ మంత్రి ఒకరు.. సీఎం వద్ద నేరుగా ప్రశ్నించినట్టు సమాచారం. అయితే బయట ప్రచారంలో ఉన్నంతగా ఏమీలేదని, రెండు చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులే భారీ మెజారిటీతో గెలువబోతున్నారని సీఎం వారి ఆందోళనలను కొట్టిపారేసినట్టు తెలిసింది.
సమన్వయలోపం వల్లే 22ఏ వివాదం!
ఇక ఈ భేటీలో వివాదాస్పద 22-ఏ నిషేధిత జాబితా భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంపైనా తీవ్ర దుమారం రేపినట్టు సమాచారం. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సమన్వయం పూర్తిగా లోపించడం వల్లే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు తలెత్తాయని పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించిన సదరు శాఖల ఉన్నతాధికారుల తీరుపై ముఖ్యమంత్రి, మంత్రు లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో మందలించినట్టు సచివాలయవర్గాల ద్వారా తెలిసింది.
విజయలక్ష్మికి అవమానం
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మికి క్యాబినెట్ సమావేశానికి పిలుపు అందకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తికి లోనైనట్టు తెలిసింది.