హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : అభివృద్ధి చెందుతున్న దేశస్థాయి నుంచి ప్రపంచస్థాయి టెక్నాలజీ పవర్‌హౌస్‌గా దక్షిణకొరియా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ, దక్షిణకొరియా మధ్య సాంకేతికత, పరిశ్రమలు, ఆవిషరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. గరువారం తెలంగాణ భవన్లో దక్షిణకొరియా అధ్యక్షుడి సలహాదారు, ప్రొఫెసర్ యంగ్ టే చోతో కేటీఆర్ సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, కొరియన్ సంస్థలతో మరింత విస్తృత భాగస్వామ్యంపై చర్చించారు.
సియోల్ నేషనల్ యూనివర్సిటీ ప్రతినిధి బృందంతోనూ కేటీఆర్ సమావేశమయ్యారు. టెక్నాలజీ, పరిశోధన, ఆవిషరణలు, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో తెలంగాణ-కొరియా మధ్య సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చ జరిగినట్టు తెలిపారు. కొరియా కంపెనీలకు ఇక్కడ అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ, దక్షిణ కొరియా మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. యంగ్ వన్ కార్పొరేషన్, హ్యుందాయ్ వంటి ప్రముఖ కొరియన్ కంపెనీలను తమ పాలనలో తెలంగాణకు తీసుకొచ్చామని గుర్తుచేశారు.