రంగారెడ్డి, జూలై 6 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో వానకాలం పంటల సాగు జోరందుకున్నది. ఈసారి అన్నిరకాల పంటల సాగు విస్తీర్ణం 2.94 లక్షల ఎకరాల్లో ఉండవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాలకు పైగా పంటల సాగు పూర్తయ్యింది. అయితే జిల్లాలో ప్రస్తుత వానకాలంలో అధికశాతం రైతులు పత్తి సాగువైపే మొగ్గు చూపుతున్నారు.
నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో వరి పంటను సాగు చేసుకుంటుండగా.. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పత్తిని సాగు చేసేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో వరిని మించి ఈ సారి పత్తి సాగవుతున్నది. జిల్లావ్యాప్తంగా 1.77లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందన్న అంచనాల మేరకు ఇప్పటికే 89,081 లక్షల ఎకరాల్లో పత్తి సాగు మొదలైంది. పత్తికి మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతున్న నేపథ్యంలో పత్తి సాగు వైపు రైతాంగం అడుగులు వేస్తున్నది.
పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్..
రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత వానకాలంలో ప్రధాన పంటగా రైతాంగం పత్తి పంటను సాగు చేస్తున్నది. గత కొన్నేండ్లుగా పత్తికి మంచి ధర పలకడం సైతం ఇందుకు ప్రధాన కారణం. నీటి అవసరం అంతగా లేకపోవడం.. లాభాలు బాగుండడంతో రైతులు నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పత్తి సాగుపైనే దృష్టి సారిస్తున్నారు. పలు ప్రాంతాల్లో నేలలు పత్తిసాగుకే అనుకూలంగా ఉండడం వంటి కారణాల నేపథ్యంలో చాలామంది రైతులు పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. గతంలో జిల్లాలో కందులు, మొక్క జొన్న వంటి పంటలను రైతులు ఎక్కువగా సాగు చేసేవారు. అయితే గత రెండు సంవత్సరాలుగా ఆయా పంటల సాగు గణనీయంగా తగ్గింది.
ఆ పంటల స్థానంలో రైతులు పత్తిని సాగు చేస్తూ వస్తున్నారు. వరి పంట సైతం ఈసారి లక్ష ఎకరాలకే పరిమితమైంది. ఇప్పటికే జిల్లాలో పత్తి సాగు లక్ష్యంలో సింహభాగం పంట సాగు పూర్తయ్యింది. అక్కడక్కడా మొలకెత్తిన పంటలో ఇప్పటికే కలుపు సైతం తీస్తున్నారు. విత్తనం మొలకెత్తని చోట రైతులు మరోసారి విత్తనాలు నాటుకుంటున్నారు. గత యాసంగి సీజన్లో మాదిరిగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడకుండా సమృద్దిగా వర్షాలు కురవాలని రైతాంగం వరుణ దేవుడిని ప్రార్థిస్తున్నారు.
డివిజన్ల వారీగా ఇప్పటివరకు సాగైన పత్తి పంట వివరాలు ఇలా..
డివిజన్ : సాగైన పత్తి (ఎకరాల్లో)
ఆమనగల్లు : 51,620
చేవెళ్ల : 21,520
ఇబ్రహీంపట్నం : 3,430
మహేశ్వరం : 1,050
రాజేంద్ర నగర్ : 11
షాద్ నగర్ : 11,450