ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇసుక తరలిం పునకు సడలింపు ఇవ్వగా.. దాని సాకుతో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. అధికార పార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్నది. లబ్ధిదారుడి పేరుతో ఐదు ట్రిప్పులకు అనుమతి తీసుకుని వందల ట్రిప్పుల వరకు ఇసుకను వాగుల నుంచి తరలిస్తూ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నది. లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నది. ఇంతా జరుగుతున్నా.. సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రజలు మండిపడుతున్నారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంకోసం ప్రభుత్వం లబ్ధిదారులకు ఇసుక తరలింపునకు సడలింపు ఇవ్వగా కొంతమంది వ్యాపారులు దానిని లైసెన్స్‌గా వాడుకుంటూ అక్రమ వ్యాపారానికి తెర తీశారు. ఇటీవల కురిసిన వర్షాలతో మార్కెట్లో ఇసుకకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వాగుల్లో నీరు నిలవడంతో ఇసుక తీసేందుకు అడ్డంకిగా మారింది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుకను జిల్లాలోని పలు వా గుల తీసుకొస్తూ.. కొన్ని ప్రాంతాల్లో డంప్ చేసి నగరంతోపాటు పలు ప్రాం తాలకు తరలిస్తూ డబ్బును ఆర్జిస్తున్నారు.
ఇందుకు వారికి కొందరు అధికారులు, అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇసుక అక్రమ వ్యాపారులకు పోలీసులూ సహకరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. మాడ్గుల, తలకొండపల్లి, కొందుర్గు, షాబాద్, మొయినాబాద్, చేవెళ్ల వంటి ప్రాంతాల్లో ఉన్న వాగుల నుంచి ఇసుకను ఇందిరమ్మ ఇండ్ల పేరుతో సేకరించి.. ఒక్క చోట డంప్ చేసి బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఒక్కో లారీని రూ.50 వేల నుంచి రూ.70వేల వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో జిల్లాలో ఇసుక అక్రమ వ్యా పారం మూడు పువ్వులు…ఆరుకాయలుగా సాగుతున్నది.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు దగ్గరలో ఉన్న వాగుల నుంచి ఐదు ట్రాక్టర్ల వరకు ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతి తప్పనిసరి. ఇందుకు సంబంధిత గ్రామానికి చెందిన పంచాయతీ సెక్రటరీ.. లబ్ధిదారుడిని ధ్రువీకరించిన తర్వాత ఎంపీడీవో, తహసీల్దార్ అనుమతులిస్తున్నారు. ఈ పర్మిషన్ను అడ్డుపెట్టుకుని ఇసుకాసురులు రోజుకు వందల ట్రిప్పుల ఇసుకను వాగుల నుంచి తీసుకొచ్చి ఇతర ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి నగరంతోపాటు పలు ప్రాంతాల్లోని ఇసుక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారం జిల్లాలో గత కొంతకాలంగా పెద్ద ఎత్తున సాగుతున్నది. ఒక్క ట్రాక్టర్ ఇసుకను రూ.8,000-రూ. 10,000 వరకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ వ్యవహారం అంతా సంబంధిత శాఖల అధికారులు, పోలీసుల సహకారంతోనే సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
మాడ్గుల మండలంలోని అందుగుల, ఇర్విన్, గిరికొత్తపల్లి, మాడ్గులలో ఇసుక వాగులు అధికంగా ఉన్నాయి. ఈ వాగుల నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేరుతో కొందరు అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. లబ్ధిదారులకు ఒకటి రెండు ట్రిప్పుల ఇసుకను పోసి అదే అనుమతితో వందల ట్రిప్పుల వరకు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. పేరుకు మాత్రమే అధికారులు ఒక్కో లబ్ధిదారుడికి ఐదు ట్రిప్పుల ఇసుకకు ఆరుగంటలు సమయం ఇస్తున్నారు. కానీ, ఇసుక వ్యాపారులు మాత్రం ఒకే అనుమతితో సంబంధిత అధికారుల అండదండలతో వందల ట్రిప్పుల ఇసుకను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు.
ఈ మండలంతోపాటు తలకొండపల్లి మండలంలోని పలు ప్రాంతాల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకొచ్చి సిరిసినగండ్ల సమీపంలో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి లారీల ద్వారా నగరానికి తరలిస్తున్నారు. మరికొందరు సమీపంలో ఉన్న దేవరకొండకు తరలించి అక్కడి నుంచి పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే, చేవెళ్ల నియోజకవర్గంలోని నాగర్‌గూడ, అమ్డాపూర్, వెంకటాపూర్ వంటి ప్రాం తాల్లో ఉన్న ఈసీ వాగు నుంచి కూడా ఇసుకను ఇందిరమ్మ లబ్ధిదారుల పేరుతో తీసుకొచ్చి బయటి మార్కెట్‌కు విక్రయిస్తున్నారు. ఇసుక అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి
వికారాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. అధికార పార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్నది. యాలాల, తాండూరు మండలాల మీదుగా వెళ్లే కాగ్నానది కేంద్రంగా అక్రమ ఇసుక రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, స్థానికంగా ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఉండడంతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట అక్రమార్కులు ఇసుకను భారీగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొంటున్నారు.
అధికారుల నుంచి కేవలం 5-10 ట్రాక్టర్ల ఇసుక తరలింపునకు అనుమతులు తీసుకొని, ఆ పర్మిషన్తో రాత్రంతా అడ్డూఅదుపు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. యాలాల మండలంలోని పలు గ్రామాల ప్రజలు అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పలుమార్లు అడ్డుకున్నా పోలీసులు తూతూ మంత్రంగా కేసులు పెట్టడం, వదిలేయడం పరిపాటిగా మారిందనే ప్రచారమూ జరుగుతున్నది. ఈ విషయమై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే మేం ఇచ్చిన అనుమతులకు మించి ఇసుకను తరలిస్తే మీరే అడ్డుకొండంటూ ఉచిత సలహాలిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా యాలాల మండలంలోని గోవిందాపూర్ గ్రా మస్తులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు.
జిల్లాలోని కాగ్నానది నుంచి ఇసుకను అక్రమంగా లారీలు, ట్రాక్టర్ల ద్వారా తోడేస్తూ.. రాత్రికి రాత్రే ఆ డంపులను మాయం చేస్తున్నారు. యాలాల మండలంలో లక్షల క్యూబిక్ మీటర్లలో ఉన్న కాగ్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ మాఫియా రెచ్చిపోతున్నది. మైనింగ్, పోలీసులు, రెవెన్యూ శాఖల అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా సాగుతున్నదనే ఆరోపణలున్నాయి. ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఒకచోట అక్రమంగా ఇసుకను తరలిస్తూ ట్రాక్టర్లు పట్టుబడుతున్నా ఈ అక్రమ వ్యాపారం మాత్రం ఆగకపోవడానికి అధికారుల వైఖరే కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొడంగల్, బొంరాస్‌పేట మండలాల్లో ఫిల్టర్ ఇసుక అక్రమ వ్యాపారం కూడా జోరుగా జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు నెలనెలా మామూళ్లు తీసుకుంటూ పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద యం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుకను తరలించేందుకు అనుమతులు పొంది.. రాత్రి వేళ్లలో యథేచ్ఛగా ఇసుకను తరలిస్తూ ఇసుక మాఫియా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నది.
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పేరిట గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను తరలిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు. జిల్లాలోని యాలాల, తాండూరు, బషీరాబాద్ మండలాల్లోని కాగ్నానది పరీవాహక ప్రాంతంతోపాటు శివసాగర్‌లో ప్రతి ఏటా రూ. కోట్ల విలువైన ఇసుక లభ్యమవుతుంది. కాగా, ఇసుక తరలించే అన్ని ట్రాక్టర్లకు జీపీఎస్ యంత్రాలను అమర్చడంతోపాటు సంబంధిత అధికారులు నిఘా పెడితేనే అక్రమ ఇసుక రవాణాకు అడ్డకట్ట పడుతుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.