బడంగ్‌పేట, జనవరి 27 : రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు కేసీఆర్ ఉచితంగా తాగునీళ్లు అందిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మాత్రం వారికి వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయి. గృహజ్యోతికి అర్హులైనా.. నెలనెలా కరెంటు చార్జీలు మాత్రం చెల్లించాల్సి వస్తున్నది. ఇదేం అన్యాయమని అడిగితే సమస్యను పరిష్కరించే నాథుడు లేడు. దీంతో బడంగ్‌పేట మున్సిపాలిటీలోని గాంధీనగర్ వాసులు సోమవారం ఏకంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఇంజినీరింగ్ విభాగం డీఈని ఘెరావ్ చేశారు.
ఇన్నాళ్లూ ఉచితంగా ఇచ్చి..
బడంగ్‌పేట మున్సిపాలిటీలోని గాంధీనగర్‌లో 1400 పై చిలుకు కుటుంబాలు ఉన్నాయి. వీరందరూ గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ కేవలం 20 ఇండ్లకు మాత్రమే జీరో బిల్లులు ఇస్తున్నారు. మిగతావారికి మాత్రం వందల రూపాయల్లో బిల్లులు పంపుతున్నారు. కాలనీ వాసులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ సమస్య అలాగే ఉండిపోయింది. కాలనీ ఏర్పడిన నాటి నుంచి.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో తాగునీళ్లను ఉచితంగానే సరఫరా చేశారని కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో మాత్రం పాత బకాయిలన్నీ కలిపి ఇవ్వాలంటూ ఒక్కో ఇంటికి వేల రూపాయల్లో బిల్లులను పంపారని కాలనీ వాసులు మండిపడుతున్నారు.
గాంధీనగర్‌లో 50 గజాలు, 30 గజాల ఇండ్లు ఉన్న వారికి 15వేలు,20 వేలు కట్టాలని నోటీసులు పంపిస్తే ఎలా కట్టగలమని వాపోయారు. అంతేకాకుండా తమ కాలనీకి మంజూరైన రోడ్డును ఉన్నట్టుండి రద్దు చేశారని అందుకు కారణమేమిటో చెప్పాలని పట్టుబట్టారు. మంచినీటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని బడంగ్‌పేట కమిషనర్ కూడా ఇటీవల హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిల్లులు మాఫీ చేసే వరకూ పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో పేదల కాలనీల్లో ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారని కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వందలో పది మందికి జీరో బిల్లు ఇచ్చి అందరికీ అయిపోయిన్నట్లు చెప్పడం పై కాలనీ వాసులు మండి పడుతున్నారు.
రూ.30 వేల నీటి బిల్లు వచ్చింది..
గాంధీనగర్‌లో మేం ఉంటున్న 2 గదులకు రూ.30వేల బిల్లొచ్చింది. ఎట్ల గట్టాలె. పేదోళ్లం సారూ. బిల్లులు మాఫీ చేస్తమంటిరి. ఇప్పటివరకు చేయలేదు. నెలనెలా మాకైతే బిల్లులు పంపిస్తున్నరు. నీైళ్లెతే సరిగ్గ వస్తలేవు కానీ బిల్లులు మాత్రం ఇచ్చిపోతున్నరు.
– నర్సమ్మ గాంధీ నగర్
ముసలోళ్లం ఎట్ల గడ్తం
ఎలక్షన్లప్పుడు ..నీళ్లు ఫ్రీగ ఇస్తమన్నరు. కరెంటు ఫ్రీ అన్నరు. ఎలక్షన్లు అయిపోయినాంక మా బాదను ఎవ్వరు పట్టించుకుంటలేరు. మేం ముసలోళ్లం. బిల్లులు కట్టనీకె వేల రూపాయలు ఏనుంచి పట్కరావాలె.
– లక్ష్మీ నర్సమ్మ
పై అధికారులకు విన్నవిస్తా..
గాంధీనగర్ తాగునీటి సమస్యను, బిల్లుల వ్యవహారాన్ని జలమండలికి నివేదిస్తా. ఈ సమస్యను పరిష్కరించాల్సింది వారే. ఇక గృహజ్యోతి-జీరో బిల్లుల వ్యవహారం కూడా నా పరిధిలో లేదు. గాంధీనగర్ వాసులు నా చాంబర్ ముందే ధర్నా చేశారు. విషయాల్నింటినీ కమిషనర్‌కు వివరిస్తా. కాలనీల్లో ఉన్న రోడ్లను పరిశీలిస్తా.
– డీఈ జ్యోతి