ఇబ్రహీంపట్నం రూరల్, ఫిబ్రవరి 11 : ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్టాండ్‌లో సమస్యలు తిష్ఠ వేశాయి. ప్రయాణికులు మంచినీటి సమస్యతోపాటు చాలీచాలని మూత్రశాలలు, మరుగుదొడ్లతో ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఇటీవల బస్టాండ్ సామర్థ్యాన్ని అధికారులు పెంచారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు 50 వేల నుంచి 80 వేల వరకు రాకపోకలు సాగిస్తుంటారు. వీరందరికీ కూర్చునేందుకు వసతితోపాటు మంచినీరు, సరిపడా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ప్రతినెలా లక్షల్లో ఆదాయం వస్తున్నప్పటికీ ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఈ బస్టాండులో తీవ్రమైన మంచినీటి సమస్య నెలకొన్నది. తాగునీటి కోసం వేసిన బోరు ఎండిపోయింది. అదనపు బోరు వేయాలని లేని పక్షంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అదేవిధంగా సరిపడా మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలని.. ఉన్న మూత్రశాలలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని కోరుతున్నారు.
బస్టాండ్‌కు ప్రతినెలా లక్షల్లో ఆదాయం వస్తున్నా సౌకర్యాలు మాత్రం కల్పించడంలేదు. ఈ బస్టాండు నుంచి ప్రతిరోజూ వేలాది మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. వారి సౌకర్యార్థం మంచినీటితోపాటు మూత్రశాలలు, మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలి.
– మడుపు వేణుగోపాల్‌రావు, బీఆర్ఎస్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి