ఇబ్రహీంపట్నం, మార్చి 6 : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండుటెండలో కూడా చెక్‌డ్యాంలు మత్తళ్లు దూకడం.. బోరుబావులు ఉబికి పోసి పంటలకు నీరందించేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని నాళ్లు అన్నదాతలకు ఎలాంటి కష్టాలు రాకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా కృషిచేసేది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కష్టాలు పగబట్టినట్టుగానే వెంబడిస్తున్నాయని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎక్కడున్నాడో, ఏ గడియల పుట్టాడో కాని, కేసీఆర్ ఉన్నప్పుడు చెంబెడు తాగే నీళ్లకు తక్లీబు కాలేదు. పంటలు సాగుచేసుకునేందుకు కూడా ఇబ్బందులు రాలేదని రైతులు తెలుపుతున్నారు. గతంలో గ్రామాల్లో ఎక్కడచూసినా మండుటెండకాలంలో కూడా రైతులు సాగుచేసిన పంటలతో వ్యవసాయ పొలాలు ఆహ్లాదాన్ని పంచేవని, కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఎక్కడ చూసిన గ్రామాల్లో ఎడారిని తలపిస్తోందని అంటున్నారు.
‘ గతంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా చేరేది. చెక్డ్యాముల్లో నీరు ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉండి భూగర్భజలాలు పుష్కలంగా ఉండేవి. అలాగే, గత ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉండటం ద్వారా భూగర్భజలాలు కూడా ఎక్కడికక్కడ తగ్గిపోకుండా రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకునేవారు. దానికి తోడు బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసి రైతుబంధు, ఇతర సౌకర్యాలతో వ్యవసాయం సాఫీగా సాగేది. కాని, కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయని.. మోసపోయి గోసపడకూడదని కేసీఆర్ ప్రతి ఒక్కరి వెన్నుతట్టి చెప్పినా వినకపోతిమి’ అని మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో గురువారం రైతులు కబుర్లు చెప్పుకుంటున్నారు. పోయి.. పోయి యమినోనికి ఓటేసి గెలిపిస్తే ఎవరిని పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. ఎక్కడున్నాడో…ఎట్లున్నాడో దేవుడిలాంటి కేసీఆర్ ఉంటే మాకు కష్టాలు వచ్చేవి కావు. మల్లా కేసీఆర్ రాజ్యం వస్తేనే అందరు బాగుంటారని రాయపోల్ గ్రామానికి చెందిన రైతు సురేందర్, ఈశ్వర్, నర్సింహగౌడ్లు అంటున్నారు.