పెద్దఅంబర్‌పేట, జూలై 17 : తాళాలేశారు..ఇండ్లు మారారు..సొంతూళ్లకు వెళ్లిపోయారు.. ఎన్యూమరేషన్ పత్రాలు ఇంకా టేబుళ్లపైనే ఎందుకు దర్శనమిస్తున్నాయన్న ప్రశ్నకు బీఎల్వోల నుంచి వస్తున్న సమాధానాలివి. కారణం ఏదైనా ఇంకా ఒక్కో పోలింగ్ కేంద్రాల్లో వందల సంఖ్యలో అప్లికేషన్లు ఇండ్లకే చేరలేదు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఓటరు ఇంటికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, నాగోల్ సర్కిల్ పరిధి పెద్దఅంబర్‌పేట, కుంట్లూరు డివిజన్లలోని చాలా పోలింగ్ కేంద్రాల్లో ఇంకా వందలాది మం దికి ఫారాలే అందలేదు.
ఫారాల పంపిణీకి ఓటర్ల చిరునామానే అసలు సమస్యగా మారిందని బీఎల్వోలు పేర్కొంటున్నారు. ఎన్యూమరేషన్లో పేర్కొన్న చిరునామాల్లో ఆయా ఓటర్లు అందుబాటులో ఉండటంలేదని చెప్తున్నారు. రెండుసార్లు తిరిగినా ప్రయోజనం లేదని.. అపార్టుమెంట్లలో ఉంటున్న ఓటర్ల చిరునామాను గుర్తించడం తలనొప్పిగా మారిందని పేర్కొంటున్నారు.
ఒక్కో బీఎల్వోకు వేల సంఖ్యలో ఫారాల పంపిణీ బాధ్యతను అప్పగించడం, ఒక్క ప్రాంతానికి పరిమితం కాకుండా వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఫారాలు ఇస్తుండటంతో ఇబ్బందులు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నాకు తట్టిఅన్నారం ఆర్కేనగర్లోని చిరునామా ఉన్న ఓటర్లు ఉండగా, పెద్దఅంబర్‌పేట శాంతినగర్‌కు చెందిన ఓటర్లు ఇంకా కొందరున్నారు. ఒక్క బీఎల్వో రెండుచోట్ల ఓటర్లకు ఎలా ఫారాలు పంపిణీ చేస్తారు.
అసలు మాకు సంబంధమే లేని ప్రాంతాల ఓటర్లకు ఫారాలు పంచమంటే ఎలా సాధ్యమవుతుంది?’ అని ఓ బీఎల్వో వాపోయారు. ఓటర్ల ఇంటికెళ్లిన సమయంలో తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి. అద్దె ఇండ్లలో ఉన్న చాలామంది వేరే ఇండ్లలోకి మారారు. ఇంకొందరు సొం తూళ్లకు వెళ్లిపోయారు. ఇలా ఎన్నో కారణాలతో ఎన్యూమరేషన్ ఫారాలు ఇంకా హెల్ప్ డెస్క్ల్లోని టేబుళ్లపైనే దర్శనమిస్తున్నాయి.
పెద్దఅంబర్‌పేట డివిజన్ కుంట్లూరు పరిధిలో 4 పోలింగ్ కేంద్రాల వరకు ఉన్నాయని, చాలామంది ఇండ్లు మారడంతో దాదాపు 20 శాతం వరకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయలేకపోయామని ఓ అధికారి తెలిపారు. ఒకసారి తాళం వేసి వెళ్తే చాలు, మరోసారి బీఎల్వోలు ఇంటికి కూడా రాలేదని, ఫోన్ చేసినా సరైన సమాధానం చెప్పడంలేదని పలు అపార్టుమెంట్లలో ఉంటున్న ఓటర్లు ఫిర్యాదు చేస్తు న్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే క్షేత్రస్థాయిలో బీఎల్వోలు ఫారాలు పూర్తిస్థా యిలో పంపిణీ చేయడంలేదని, ఇప్పటివకైనా అందరికీ అందేలా చూడాలని అంటున్నారు.