రంగారెడ్డి, ఫిబ్రవరి 3, (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఇప్పటివరకు గతేడాదికి మించి రెవెన్యూ ఖజానాకు వచ్చి చేరింది. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో రూ.2813 కోట్ల ఆదాయం వచ్చింది. భూముల మార్కెట్ విలువ పెంపు అమలు ప్రక్రియతో జనవరి నెలలో అత్యధికంగా రిజిస్ట్రేషన్లు కావడంతోపాటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువ ధరల పెంపు అమల్లోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించడంతో గత నెల చివరి వారంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు క్రయ, విక్రయదారులతో కిటకిటలాడాయి. అత్యధికంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారానే ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు రూ.వెయ్యి కోట్లకుపైగా రెవెన్యూ అధికంగా రావడం గమనార్హం.
జిల్లాలోని వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాల ద్వారా జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు రూ.2813 కోట్ల రెవెన్యూ వచ్చింది. గండిపేట్, శేరిలింగంపల్లి, మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెవెన్యూ ప్రభుత్వ ఖజానాకు చేరింది. జిల్లావ్యాప్తంగా ఏప్రిల్ నుంచి జనవరి వరకు 2,11,780 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1565కోట్ల ఆదాయం జిల్లా ఖజానాకు సమకూరగా, ఈ ఏడాది రూ.1300 కోట్ల ఆదాయం అధికంగా వచ్చింది. జిల్లాలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జనవరి 28న 2528 డాక్యుమెంట్లు, 29న 2349 డాక్యుమెంట్లు, 30న 2678 డాక్యుమెంట్లు, 31న 3 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అదేవిధంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కూడా గత నెల చివరి వారంలో భారీగా పెరిగాయి.
సాధారణంగా రోజుకు అత్యధికంగా 20 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్లు అవుతుండగా, జనవరి చివరి వారంలో 60 వరకు రిజిస్ట్రేషన్లయ్యాయి. జనవరిలో ప్రభుత్వ ఖజానాకు చేరిన ఆదాయాన్ని పరిశీలిస్తే.. కొడంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.20.7 లక్షలు, షాద్‌నగర్ రూ.6.71 కోట్లు, ఫరూఖ్‌నగర్ రూ.6.15 కోట్లు, చేవెళ్ల రూ.6.18కోట్లు, హయత్‌నగర్ రూ.5.98కోట్లు, ఇబ్రహీంపట్నం రూ.6.31కోట్లు, పరిగి రూ.81.1లక్షలు, తాండూరు రూ.1.82 కోట్లు, వికారాబాద్ రూ.1.88 కోట్లు, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.106.19 కోట్లు, సరూర్‌నగర్ రూ.8.95 కోట్లు, చంపాపేట్ రూ.12.41 కోట్లు, పెద్దఅంబర్‌పేట్ రూ.4కోట్లు, రాజేంద్రనగర్ రూ.27. 67 కోట్లు, మహేశ్వరం రూ.18.59 కోట్లు, శంషాబాద్ రూ.7.12 కోట్లు, శేరిలింగంపల్లి రూ.30.15 కోట్లు, శంకర్పల్లి రూ.8. 72కోట్లు, గండిపేట్ రూ.100.32 కోట్లు, ఎల్బీనగర్ రూ.17.04 కోట్లు, వనస్థలిపురం రూ.7.95 కోట్లు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో రూ.4.45 కోట్ల ఆదా యం జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఖజానాలో జమయ్యింది.
జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2,11,780 డాక్యుమెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. అత్యధికంగా మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యింది.