వికారాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. శుక్రవారం ఆఖరి రోజు కావడంతో జిల్లాలోని వికారాబాద్, తాండూ రు, పరిగి, కొడంగల్ మున్సిపల్ కార్యాలయాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కోలాహలం నెలకొన్నది. ఆయా పార్టీల అభ్యర్థులు తమ మద్దతుదారులతో నామినేషన్ కేంద్రాలకు తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేయగా సందడి నెలకొన్నది. నాలుగు మున్సిపాలిటీల్లో ఆఖరి రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు వచ్చాయి. ఒక్కరోజే 558 నామినేషన్లు దాఖలు కాగా ఇప్పటివరకు నాలుగు మున్సిపాలిటీల్లో 824 నామినేషన్లు వచ్చాయి.
మరోవైపు తాండూరు మున్సిపాలిటీలో పదోవార్డు నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింహులుతోపాటు తొమ్మిదోవార్డు నుంచి పోటీ చేస్తున్న దీపానర్సింహులు నామినేషన్‌కు మద్దతుగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, తాండూరు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా పరిగి మున్సిపాలిటీలో నాల్గోవార్డు నుంచి పోటీ చేస్తున్న చైర్పర్సన్ అభ్యర్థి శివన్నోళ్ల చంద్రకళాభాస్కర్, 18వ వార్డు, 17వ వార్డు, 10వ వార్డుల అభ్యర్థుల నరేశ్, వెదిరె పద్మ, రవికుమార్ నామినేషన్లకు మద్దతుగా పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, ఇన్చార్జి ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తైన దృష్ట్యా నేడు లేదా రేపు ఆయా వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులకు బీ-ఫారాలను మాజీ ఎమ్మెల్యేలు అందజేయనున్నారు.
100 వార్డులకు 781 నామినేషన్లు..
జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లోని 100 వార్డులకు 781 నామినేషన్లు వచ్చాయి. వికారాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా నామినేషన్లు రాగా, కొడంగల్‌లో అత్యల్పంగా దాఖలయ్యాయి. నామినేషన్ల ఆఖరి రోజు ఒక్కరోజే 4 మున్సిపాలిటీల్లో కలిపి 558 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం తాండూరు మున్సిపాలిటీలో 165 నామినేషన్లు, వికారాబాద్‌లో 184, పరిగిలో 158, కొడంగల్ మున్సిపాలిటీలో 52 వచ్చాయి. మూడు రోజుల్లో మొత్తం 824 నామినేషన్లు దాఖలు కాగా, అత్యధికంగా వికారాబాద్ మున్సిపాలిటీలో తొలిరోజు 11, రెండోరోజు 97, ఆఖరి రోజు 183 దాఖలుకాగా మొత్తం 278 నామినేషన్లు, తాండూరు మున్సిపాలిటీలో తొలిరోజు 11, రెండో రోజు 97, ఆఖరి రోజు 165 రాగా.. 273 నామినేషన్లు, పరిగి మున్సిపాలిటీలో తొలిరోజు 2, రెండోరోజు 41, ఆఖరి రోజు 115, మొత్తం 158 నామినేషన్లు, కొడంగల్ మున్సిపాలిటీలో తొలిరోజు నిల్, రెండో రోజు 20, చివరి రోజు 52 దాఖలుకాగా మొత్తం 72 నామినేషన్లు వచ్చాయి.తాండూరు మున్సిపాలిటీలో పార్టీల వారీగా దాఖలైన నామినేషన్లకు సంబంధించి…బీఆర్ఎస్ నుంచి 96, బీఎస్పీ-1, బీజేపీ-49, కాంగ్రెస్-88, ఎంఐఎం-16 , జనసేన -8 , స్వతంత్ర అభ్యర్థుల నుంచి15 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే, కొడంగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్-19, బీజేపీ-5, సీపీఎం-1, కాంగ్రెస్-25, ఎంఐఎం-4, స్వతంత్రులు-18 నామినేషన్లు వేశారు.
126వార్డులకు 891నామినేషన్లు..
రంగారెడ్డి, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఆరు మున్సిపాలిటీల్లోని 126 వార్డులకు 891 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అధికారులు 5 గంటల్లోపు వచ్చిన వారిని నామినేషన్లు వేసేందుకు అనుమతించగా.. స్వీకరణ ప్రక్రియ రాత్రి 8 గంటల వరకు సాగింది. కాగా, శనివారం నామినేషన్ల పరిశీలన ఉంటుందని అధికారులు తెలిపారు.
మున్సిపాలిటీల వారీగా నామినేషన్లు..
ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 వార్డులకు 109 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు శుక్రవారం 60 నామినేషన్లు వచ్చాయి. అలాగే, శంకర్పల్లి మున్సిపాలిటీలో 15 వార్డులకు 100 నామినేషన్లు వచ్చాయి. చివరిరోజు 42 దాఖలయ్యాయి. చేవెళ్ల మున్సిపాలిటీలో 18 వార్డులకు 133 నామినేషన్లు రాగా.. చివరి రోజు 81వచ్చాయి. మొయినాబాద్ మున్సిపాలిటీలో 26 వార్డులకు 178 నామినేషన్లు రాగా.. శుక్రవారం 101 మంది దాఖలయ్యాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులకు 191 నామినేషన్లు రాగా..చివరిరోజు 114 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
షాద్‌నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులకు170 నామినేషన్లు రాగా.. చివరి రోజు 110 వచ్చాయి. చివరిరోజు నామినేషన్ల దాఖలు అట్టహాసంగా జరిగింది. అభ్యర్థులు తమ మద్దతుదారులతో ఊరేగింపుగా..ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేశారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ పాల్గొన్నారు.
నేడు నామినేషన్ల పరిశీలన..
నామినేషన్ల స్వీకరణ గడువు శుక్రవారంతో ముగియడంతో శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నామినేషన్లను ఎన్ని కల అధికారులు పరిశీలించనున్నారు. మూడు రోజులుగా దాఖలైన నామినేషన్లను పరిశీలించి.. ధ్రువపత్రాలు లేకపోవడం లేదా నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాలను పూర్తి చేయకపోయినా సంబంధిత పత్రాలను తిరస్కరించనున్నా రు. అయితే నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు అవకాశమున్నది. ఆ లోపు ఆయా పార్టీల నుంచి ఒక్కో వార్డుకు ఇద్దరు, ముగ్గురు వేసిన నామినేషన్లలో బీ-ఫాం సమర్పించిన వారు మినహా మిగతా వారు తమ నామినేషన్లను వెనక్కి తీసుకునేలా ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఈనెల 3నే ఆయా వార్డుల్లో పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.