వికారాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రారంభించాలని నిర్ణయించిన రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు కేవలం కొంత మందిని మాత్రమే ఎంపిక చేసి అర్హులైన సుమారు లక్ష మందికి అన్యాయం చేసింది. నాలుగు పథకాలకు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను వెల్లడించేందుకు నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తుల స్వీకరణతో ముగిసింది. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు గ్రామ, వార్డు సభలకు ముందే లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ సంబంధిత లబ్ధిదారుల జాబితాలో కొత్త రేషన్‌కార్డుల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులు చాలా మంది ఉండడం, వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా నాలుగు పథకాలకుగాను అధికారులు ఎంపిక చేసిన జాబితా కాకుండా కొత్తగా సుమారు లక్ష మంది అర్హులు దరఖాస్తు చేసుకున్నారు.
గ్రామ, వార్డు సభల్లో అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారే తప్ప సంబంధిత దరఖాస్తులకు సంబంధించి పరిశీలన ప్రక్రియ, అర్హుల ఎంపిక ప్రక్రియ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు సంబంధిత పథకాల ప్రయోజనం అందిస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఇదే విషయమై సంబంధిత అధికారులను వివరణ అడుగగా.. దరఖాస్తుల స్వీకరణ వరకే మా బాధ్యత.. దరఖాస్తుల పరశీలనతోపాటు అర్హుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నుంచి విధివిధానాలు రావాల్సి ఉన్నదని అధికారులు వెల్లడించారు.
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఇందిరమ్మ కమిటీలకు అప్పగించడం, ఆ కమిటీల్లో కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉండడంతో లబ్ధిదారుల జాబితాలోనూ కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారినే ఎంపిక చేయడంపై సర్వతా ఆరోపణలు వస్తున్నాయి. సబ్బండ వర్ణాలకు అందించాల్సిన సంక్షేమ పథకాల ఫలాలను ఒక్క పార్టీకి చెందిన వారికే అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండడంపై సర్వతా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకుగాను అర్హులైనప్పటికీ నామమాత్రంగా దరఖాస్తులు స్వీకరించి విస్మరిస్తుండడంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు.
రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకానికిగాను అధికారులు ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలో సగానికిపైగా అర్హులకు అన్యాయం చేయడంతో గ్రామ, వార్డు సభల్లో భారీగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ నాలుగు పథకాలకుగాను ఈ నెల 24 వరకు అర్హులైన వారి నుంచి కొత్తగా 96,423 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కేవలం 23,542 మందికి కొత్త రేషన్ కార్డులను జారీ చేసి చేతులు దులుపుకుందామనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు షాకిచ్చారు. జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో మళ్లీ దరఖాస్తులను స్వీకరించారు. కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లావ్యాప్తంగా 58,784 దరఖాస్తులు రావడం గమనార్హం. ఇందిరమ్మ ఇండ్ల కోసం 26,312 దరఖాస్తులు, రైతు భరోసాకు 3745 దరఖాస్తులు, ఆత్మీయ భరోసాకు 7582 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
జాబితాలో పేరు రాని వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం మోసం. మేము ఎలా అనర్హులమో గ్రామసభల్లో తెలుపాల్సి ఉండే. ఎన్నికల కోసమే ఆర్భాటం చేస్తున్నారని అర్థమవుతున్నది. అర్హులకు న్యాయం చేస్తున్న కాంగ్రెస్‌కు రాబోవు రోజుల్లో గుణపాఠం తప్పదు.
– రవికుమార్, బషీరాబాద్ మండలం
మా తల్లిదండ్రులకు ముగ్గురం అన్నదమ్ములం. నాకు, తమ్ముడికి పెండ్లిళ్లు అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడంతో ఇద్దరం దరఖాస్తు చేసుకున్నాం. ఎన్నో ఆశలు పెట్టుకుంటే జాబితాలో మా పేర్లు రాలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు.
– రాజు, దామర్చేడ్ గ్రామం, బషీరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పింది. ఆ నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాం. మాకు స్థలం ఉన్నది. మా ఇంట్లో ఏడుగురం సభ్యులం ఉంటాం. ఇల్లు సరిపోవడం లేదు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. లిస్టులో మా పేరు రాలేదు. ఇందిరమ్మ ఇల్లు వస్తే మాకు కొంత మేలు జరుగుతుంది.
– అజీజ్మియా, కల్కోడ, మర్పల్లి
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు పేదలకు అన్నింటా సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా వంటి పథకాలకు ధరఖాస్తు చేసుకున్నా. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఏ ఒక్క పథకానికి పేరు లేదు. ఎన్నికల్లో చెప్పినట్లు అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికీ పథకాలను మంజూరు చేయాలి.
– రాజశేఖర్, పాత కొడంగల్, కొడంగల్
ప్రజాపాలనలో ప్రస్తుతం అమలు చేస్తామన్న 4 పథకాలకు నేను దరఖాస్తు చేసుకున్నా. కానీ జాబితాలో ఏ ఒక్క పథకంలో పేరు రాలేదు. అర్హత ఉన్నప్పటికీ పథకానికి ఎంపిక చేయకపోవడం అధికారుల తప్పా.. లేక ప్రభుత్వం తప్పా తెల్వదు. జాబితాల్లో చాలా మంది పేర్లు లేవు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. అప్పుడు దరఖాస్తు చేసుకున్నవి ఏమైనట్లో తెల్వదు. మళ్లీ దరఖాస్తు చేసుకున్నా వస్తాయనే ఆశ లేదు.
– పీ వెంకటయ్య, పాత కొడంగల్, కొడంగల్