Manchala | మంచాల, జులై 29 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం.. లబ్దిదారులను ఇండ్లలోకి పంపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. లబ్దిదారులే స్వయంగా ఆదివారం సామూహిక గృహ ప్రవేశాలు చేశారు.
మంచాల మండలం లింగంపల్లి గేటు సమీపంలో మంచాల. లింగంపల్లి. నోముల గ్రామాలకు చెందిన 96 మందికి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎంపిక చేసింది. కానీ నేటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్న కూడా వారికి కేటాయించిన ఇండ్లలోకి పంపించకపోవడంతో ఎంతో నిరాశతో ఉన్న లబ్ధిదారులు ఆదివారం నేరుగా సామూహిక గృహప్రవేశం చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో నీళ్లు, కరెంటు లేకపోయినా మాకు కేటాయిస్తే ఆ నివాసాల్లో ఉంటామని లబ్ధిదారులు వేడుకున్నారు. అయినా స్పందన లేకపోవడంతో గృహ ప్రవేశం చేశారు. ఈ సామూహిక గృహ ప్రవేశాల గురించి మండల అధికారులకు తెలిసినప్పటికీ.. చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని లబ్దిదారులు ఆరోపించారు. మాకు కేటాయించిన ఇళ్లల్లోకి వెంటనే కరెంటు, నీళ్లు ఇవ్వాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్టు వారు స్పష్టం చేశారు.