వికారాబాద్, ఫిబ్రవరి 9 : ఆశ వర్కర్లకు పెండింగ్లో ఉన్న రెండు నెలల వేతనాలను వెంటనే చెల్లించడంతోపాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు రూ.24 వేల జీతం ఇవ్వాలని బీఆర్టీ యూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆశ వర్కర్ల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ వర్కర్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నాయన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న రూ. 9900లను సైతం నెలనెలా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద బీమా రూ.5లక్షలు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు సైతం కల్పించాలన్నారు. ఈ నెల 16న జరుగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 16 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డికి అందజేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రన్న, బీఆర్టీయూ జిల్లా నాయకులు కృష్ణ, తెలంగాణ గ్రామీణ ఆరోగ్య ఆశ కార్మికుల సంఘం (బీఆర్టీయూ అనుబంధం) జిల్లా కార్యదర్శి అనిత, జిల్లా ఉపాధ్యక్షురాలు నాగమణి, నర్సమ్మ, జిల్లా నాయకురాలు మంగమ్మ, అమృత, ఉర్మిళ పాల్గొన్నారు.