కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, కాళేశ్వరంలోని బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగిపోయినందుకే కాంగ్రెస్ చిల్లర ప్రచారానికి తెరలేపింది. కాళేశ్వరానికి సంబంధించిన నివేదికలో తీర్పుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టులా ఉంది. కాంగ్రెస్ చేసిన కుట్రలన్నీ తలకిందులయ్యాయి. దేశంలో న్యాయ వ్యవస్థ బతికే ఉంది. ఇందుకు బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పే నిదర్శనం. అనేక కుట్రలు చేసిన బీఆర్ఎస్పై కాంగ్రెస్ బురద జల్లే ప్రయత్నం చేసింది. ఈ కుట్రలన్నీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కింద మూసుకుపోయాయి. 34 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తెలంగాణ రైతుల ఇబ్బందులు తొలగించి సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. హైకోర్టు తీర్పుతో కడిగిన ముత్యంలా కేసీఆర్ బయటకు వచ్చారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గరపెట్టుకుని ప్రవర్తించాలి. అభివృద్ధిపై దృష్టి సారించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ రైతులపాలిట కేసీఆర్ కాళేశ్వరుడు. పేదల ఇండ్లు కూలగొట్టిన రేవంత్‌రెడ్డి కూలేశ్వరుడు. భగీరథుడిలా చరిత్రలో నిలిపోయిన మహానుభావుడు కేసీఆర్. కాళేశ్వరంపై డ్రామాలు ఆడిన రేవంత్‌రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లమైంది. రేవంత్‌రెడ్డి ఎన్ని ఆటలు ఆడినా.. న్యాయస్థానం ముందు మొట్టికాయలు తప్పలేదు. ఏ తప్పు చేసినా వెంటనే దొరికిపోయే నైజం రేవంత్‌రెడ్డిది అన్నారు. ప్రజాపాలన అని చెప్పుకొంటూ వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులను.. ఇలా సమాజంలో ప్రతి ఒక్కరినీ బాధపెడుతున్నారు.
– మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు
కాంగ్రెస్ ప్రభుత్వ నీతిమాలిన రాజకీయంతో రాష్ట్ర ప్రజలు అన్నింటా ఇబ్బందులకు గురౌతూ.. ప్రజా సంక్షేమానికి తూట్లు పడుతున్నాయి. పీసీ ఘోష్ నివేదిక పీసీసీ నివేదికలా ఉంది. ఇందుకు హైకోర్టు ఇచ్చిన తీర్పు నిదర్శనం. ఇది సీఎం రేవంత్‌రెడ్డికి చెంపపెట్టుగా ఉంది. అప్పట్లో 20 లక్షల ఎకరాలకు సాగునీరందించి వరి సాగుతో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నం.1 స్థానంలో నిలబెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. అటువంటి కాళేశ్వరం ప్రాజక్టును కాంగ్రెస్ నాయకులు కూళేశ్వరంగా పేర్కొని అవమానించడం జరిగింది. గడిచిన మూడు సంవత్సరాల్లో కూలిన మేడిగడ్డ రెండు పిల్లర్లకు మరమ్మతులు చేపట్టకుండా మాజీ కుట్ర రాజకీయాలతో రైతులకు సాగునీరందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎల్అండ్టీ కంపెనీ ముందుకు వచ్చి కూలిన రెండు పిల్లర్లను రూ.400 కోట్లతో మరమ్మతులు చేయిస్తానంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా కేసీఆర్‌ను బదనాం చేసేందుకు కుట్ర పన్నుతున్నది. కోర్టు తీర్పుతోనైనా సీఎం బుద్ధి తెచ్చుకొని కాళేశ్వరం మరమ్మతులు చేపట్టి రైతు, ప్రజా సంక్షేమానికి పాటుపడాలి. వచ్చే రెండు సంవత్సరాల తరువాత మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ప్రతి అధికారి, కాంట్రాక్టర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవడం ఖాయం.
– పట్నం నరేందర్‌రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన పీసీ ఘోష్ కమీషన్ నివేదిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెటు. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ కుట్రలన్నీ పటాపంచలయ్యాయి. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్టు ఈ కమిషన్ నివేదిక రూపంలో అందజేసిందన్నది తేటతెల్లం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై కాంగ్రెస్ దుష్ర్పచారం చేయగా హైకోర్టు తీర్పుతో ఈ కుట్రలన్నీ కూలిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్, కేసీఆర్‌పై కుట్రపూరితంగా బురద జల్లడం తప్ప మరోటి లేదు. కమిషన్ సైతం తన విచారణలో దోషిగా తేలిన తర్వాతే చర్యలకు సిఫారసు చేయాలి, కానీ ఏమీ లేకుండానే చర్యలకు సిఫారసు చేయడం తగదు. ఇప్పటికైనా కాంగ్రెస్ వారు బుద్ది తెచ్చుకొని పాలనపై దృష్టి పెట్టాలి.
– కొప్పుల మహేశ్‌రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే
రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో అప్పటి సీఎం కేసీఆర్ 94వేల కోట్ల నిధులతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ నేతల తీరులో మార్పు రావాలి. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలను మానుకోవాలి. కేసీఆర్ హరీశ్‌రావులను బదనాం చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలు గమనించారు. మేడిగడ్డ బ్యారేజ్‌లోని రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందనే రీతిలో ప్రచారాలు చేయడం సిగ్గుచేటు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ తీరును ప్రపంచ దేశాలు సైతం అభినందించాయి. సాగునీటి నిపుణులు సైతం ప్రశంసించారు. నేడు లక్షలాది ఎకరాలకు నీళ్లు అందిస్తున్న ప్రాజెక్టుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయాలకు పాల్పడటం సరికాదు. ఇప్పటికైనా కాళేశ్వరం ద్వారా పూర్తిస్థాయిలో నీళ్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– అంజయ్యయాదవ్, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే
పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కేసీఆర్ గత పాలనకు క్లీన్చిట్ వచ్చినట్లు అయింది. కాళేశ్వర్వం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పుతోనైనా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కండ్లు తెరిచి తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి. రాజకీయ లబ్ధి కోసం చేసే కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారు. సర్కారు, పాలకులు ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలుస్తుంది. తీర్పును యావత్ తెలంగాణ సమాజం హర్షిస్తూ స్వాగతిస్తున్నది. సత్యదూరమైన వార్తలను వండి వడ్డించే కుట్రల్లో మీడియా భాగస్వామ్యం కావద్దు.
– రాంబల్‌నాయక్, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు
న్యాయ విరుద్ధంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉంది. అందుకే కోర్టులో నివేదికకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. రైతాంగ సంక్షేమం, వ్యవసాయంపై కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధి కోర్టు తీర్పుతో మరోమారు రుజువైంది. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలను వెంటనే మానుకోవాలి.
– రాజావరప్రసాదరావు, తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్