రంగారెడ్డి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో ఆశావహులు అయోమయంలో పడ్డారు. జిల్లాలోని 21 మండలాల్లోని అన్ని గ్రామాల్లోనూ సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు చాలామంది నాయకులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఈ ఎన్నికలకు ఎక్కువ గడువు ఇవ్వకపోవడంతో ఎలక్షన్స్‌లో పోటీచేసేందుకు ముందుకొచ్చిన నాయకులకు సకాలంలో డబ్బు సమకూరక చాలా చోట్ల తక్కువ ధరకు భూములు, ఇండ్ల స్థలాలను అమ్ముకున్నారు. తీరా రాష్ట్ర సర్వోన్నత న్యా యస్థానం ఈ ఎన్నికలపై స్టే విధించడంతో వారు సంకటస్థితిలో పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో చాలామంది ఆశావహులు అవస్థలు పడుతున్నారు.
ఉన్న భూములు, స్థలాలు పోయాయని లబోదిబోమంటున్నారు.
జిల్లాలో మొదటి దశలో చేవెళ్ల డివిజన్లో నాలుగు మండలాలు, కందుకూరు డివిజన్లో ఆరు మండలాలు, రాజేంద్రనగర్ డివిజన్లోని శంషాబాద్ మండలంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో 10 జడ్పీటీసీలు, 17 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అందుకనుగుణంగానే ఆయా పార్టీలకు చెందిన నాయకులు పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని గ్రామాలు అధికంగా ఫ్యూచర్‌సిటీలో కలుస్తాయని తెలుస్తుండడంతో.. ఈ గ్రామాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని భావించి.. ఈ ఊర్లలో పోటీచేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలామంది నాయకులు సిద్ధమయ్యారు.
ఆమనగల్లు మండలంలో ఓ గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ఓ వ్యక్తి తన పదెకరాల పొలాన్ని విక్రయించాడు. ప్రస్తుతం బయటి మార్కెట్లో ఎకరం ధర రూ.70 నుంచి రూ.80 లక్షలుండగా, ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశంతో రూ.50 లక్షలకే ఎకరం చొప్పున విక్రయించాడు. ఈ దశలో ఎన్నికలను హైకోర్టు నిలిపేయడంతో తాను తీవ్రంగా నష్టపోయానని వాపోతున్నాడు. కాంగ్రెస్ సర్కార్‌ను నమ్మి రోడ్డున పడ్డానని కుమిలిపోతున్నాడు. యాచారం మండలంలోనూ ఓ పార్టీకి చెందిన నేత ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్థిరాస్తిని తక్కువ ధరకు విక్రయించి డబ్బును సమకూర్చుకున్నాడు. ఇప్పుడు లబోదిబోమంటున్నాడు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కాదని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని పలువురు ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 42% రిజర్వేషన్‌ను తప్పనిసరిగా అమలుచేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతోనే చాలామంది ఆశావహులు తమ ఆస్తులు, పొలాలను అమ్ముకుని.. ఇప్పుడు రోదిస్తున్నారు. ప్రభుత్వం తమను నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ ఆశావహుల విందు రాజకీయాలు జోరుగా కొనసాగాయి. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రావడంతో గత పది పదిహేను రోజులుగా గ్రామాల్లో ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆశావహులు గ్రామాల్లో హడావుడి చేశారు. దసరా సందర్భంగా పెద్ద ఎత్తున డబ్బు, మద్యాన్ని సరఫరా చేశారు. కొన్ని గ్రామాల్లో ఆశావహులు దసరాను పురస్కరించుకుని ప్రజలకు దుస్తులు కుట్టించడం, ప్రత్యేక విందుల ఏర్పాటు, నాలుగైదు ఇండ్లకు కలిపి మేకలనూ అందించారు. యువతకు ప్రతిరోజూ మద్యాన్ని తాగించి మచ్చిక చేసుకున్నారు. అయితే హైకోర్టు తీర్పుతో ఆశావహులు అయోమయంలో పడ్డారు. ఉన్న భూములు, పొలాలు పోయాయని.. రోడ్డున పడ్డామని పేర్కొంటున్నారు.