(నమస్తే తెలంగాణ) వికారాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) :అభివృద్ధి పేరిట అరాచకానికి తెరతీసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు కళ్లెం వేసింది. నేల తల్లిని నమ్ముకొని పల్లె ఒడిలో నివసిస్తున్న గిరిజనుల భూ ములను ఫార్మా కంపెనీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా తీసుకునేందుకు యత్నించిన విష యం విదితమే. తాము ఓటేసి గెలిపిస్తే ముఖ్యమం త్రి అయిన రేవంత్‌రెడ్డి.. తమ బతుకులను ఆగం చేస్తున్నాడని ఆగ్రహించిన లగచర్ల తదితర ఐదు గ్రామాల గిరిజన రైతులు ఎదురు తిరిగినందుకు అర్ధరాత్రి సమయంలో తండాలో పోలీసులు సాగించిన దమనకాండ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అక్రమ కేసులతో గిరిజనులను నానా ఇక్కట్లు పెట్టిన విషయంలోనూ ప్రభుత్వం అప్రతిష్ట పాలైం ది. స్థానికుల పోరాటపటిమతో ప్రభుత్వం తాత్కాలికంగా వెనుకడుగు వేసి ఫార్మా కంపెనీల ఏర్పాటు ప్రతిపాదనను పక్కకు పెట్టినా… ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట కొత్త డ్రామాను ప్రారంభించింది. గిరిజనులు భూములు ఇవ్వాల్సిందేనని పట్టుపట్టింది. దీంతో కోర్టును ఆశ్రయించిన బాధితులకు గురువా రం స్టే లభించడంతో ఆ ఐదు గ్రామాల్లో సంబురాలు మిన్నంటుతున్నాయి. తమకు అన్యాయం జరిగితే పిడికిలి బిగించి ఎదురు తిరగడమే కాదు… దొడ్డిదారిన తమ భూముల్ని లాక్కోవాలని ప్రయత్నిస్తే న్యాయపరంగా ఎదుర్కొంటామని నిరూపించారు. మా భూములు మాకేనని.. పోరాట పటిమని చూపిన లగచర్ల తదితర గ్రామాల ప్రజలను రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.
లగచర్ల రైతుల పోరాటం ఫలించింది. ప్రభుత్వం మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు చేపట్టిన భూసేకరణను నిలిపివేయాలని గురువారం హైకోర్టు మధ్యంతర తీర్పు ఇవ్వడంతో హకీంపేట, లగచర్ల, పోలేపల్లి, రోటిబండతండా, పులిచర్ల తండాల్లోని గిరిజన రైతులు సంబురాలు చేసుకుంటున్నా రు. తమ గ్రామాల్లో ఫార్మా కంపెనీల ఏర్పా టు వద్దే.. వద్దు అంటూ పై గ్రామాల గిరిజన రైతులు లగచర్లలో జరిగిన భూసేకరణను అడ్డుకుని అధికారులకు ఎదురు తిరిగారు. దీంతో పోలీసులు అర్ధరాత్రి తండాలోకి ప్రవేశించి మహిళలు, వృద్ధులు, చిన్నారులు అని చూడకుండా భయభ్రాంతులకు గురిచేసినా.. కేసులు పెట్టి జైలుకు పంపించినా వారు మాత్రం వెనక్కి తగ్గలేరు. ప్రాణాలైనా ఇస్తాం కానీ.. తమ భూములివ్వమని ఇచ్చేదిలేదని తెగేసి చెప్పారు. ఏడాదిపాటు ఇంటిల్లిపాది తిండి, తిప్పలు మాని నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలతో తమ పోరాటాన్ని ఉధృతం చేసి చివరకు హైకోర్టు తీర్పుతో సర్కార్ మెడలు వంచారు. లగచర్ల రైతులకు మొదట్నుంచి అండగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ లగచర్లలో గిరిజన రైతులకు జరిగిన అన్యాయాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా చేసింది. దీంతో దిగివచ్చిన ప్రభు త్వం ఈ ఐదు గ్రామాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
మొదట్నుంచి వ్యతిరేకతే..
సీఎం ఇలాకా.. దుద్యాల మండలంలోని లగచర్ల, పోలేపల్లి, హాకీంపేట, రోటిబండతండా, పులిచర్ల తండాల పరిధిలోని సుమారు 1,274 ఎకరాల్లో ఫార్మా కంపెనీలను ఏర్పా టు చేయాలని ప్రభుత్వం భావించిన నాటి నుంచే ఆయా గ్రామాలు, తండాల గిరిజనులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత భూసేకరణకు ప్రత్యేకంగా నియమించిన కడా అధికారులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పదుల సార్లు గిరిజనులతో సమావేశమై కంపెనీలొస్తే ఉద్యోగాలొస్తాయని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా గిరిజన రైతులు మాత్రం భూ ములిచ్చేది లేదని స్పష్టం చేశారు. కాగా భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతుల్లో ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు ముందుకొచ్చి ఫార్మా కంపెనీల ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన లు చేసినా బాధిత గ్రామాల ప్రజలు, రైతులు మొదట్నుంచి వద్దంటే వద్దని వ్యతిరేకించారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు భూసేకరణకు చర్యలు చేపట్టగా.. వారికి వ్యతిరేకంగా గిరిజనులు లగచర్లలో ఎదురుతిరిగారు.
లగచర్ల ఘటన అనంతరం గిరిజన మహిళలు, వృద్ధులపై పోలీసుల దౌర్జన్యంతోపాటు సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి బాధిత తం డాల్లో పర్యటించి ఎట్టి పరిస్థితుల్లోనూ భూములివ్వాల్సిందేనని బెదిరింపులకు పా ల్పడడం, సోషల్ మీడియాలో ఈ విషయం హల్చల్ కావడంతో పరిస్థితులు అంతా తారుమారయ్యాయి. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా గిరిజన, ప్రజా సంఘాలు ప్రభు త్వ తీరును ఖండించడతోపాటు గిరిజనులకు మద్దతుగా రోడ్డెక్కారు. గిరిజనుల నుంచి భూములను లాక్కుంటామన్న సీఎం సోదరుడి తీరును ఖండించడంతోపాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంతటా వ్యతిరేకత రావడంతో ఫార్మా కంపెనీలకు బదులుగా మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్కు అంటూ పేరు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా భూ సేకరణను చేపట్టగా రైతు లు కోర్టుకెళ్లడంతో వారికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది.
గిరిజన రైతులకు అండగా బీఆర్ఎస్..
బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీలు, ప్రజా, గిరిజన సంఘాల నాయకులు లగచర్ల రైతుల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. లగచర్ల ఘటన అనంతరం పోలీసులు తండాలో అర్ధరాత్రి సమ యంలో సాగించిన దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించ డంతోపాటు అక్కడికెళ్లి భరోసానిచ్చారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ గిరిజనులకు వెన్నంటే ఉండగా.. వారికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించాలని తలపించగా.. కక్ష కట్టిన సీఎం రేవంత్‌రె డ్డి ఆయన్ను జైలుకు పంపించారు.
ఫార్మా కంపెనీలకు తమ భూములు ఇవ్వబోమని ఎదురుతిరిగిన రైతులను సర్కార్ జైల్లో పెట్టగా.. వారి కుటుంబాల సభ్యులు తమకు జరిగిన అన్యాయాన్ని ఢిల్లీలోని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ల చైర్మన్ల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు రేవంత్ సర్కార్ నియంతృత్వ వైఖరిని దేశమంతా అందరికీ తెలిసేలా చేశారు. ఎస్టీ కమిషన్ సభ్యులు నేరుగా లగచర్ల వెళ్లి ప్రభుత్వ చర్యలను ఎండగట్టి వారికి భరోసా కల్పించారు. అదేవిధంగా బీజేపీ, వామపక్ష పార్టీలు ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టి.. గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయడంతోపాటు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తూ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు పేరిట పేరు మార్చి మళ్లీ భూ సేకరణ చేపట్టింది.
భూమి లేకుంటే చావే శరణ్యం..
నాకు హకీంపేటలో రెండెకరాల భూమి ఉన్నది. దానినే నమ్ముకొని బతుకుతున్నా. ఉన్న ఎకరం, రెండు ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకుంటే మేము ఎలా జీవించాలి. భూమి లేకుంటే చావే శరణ్యం. అందుకే హైకోర్టును ఆశ్రయించాం. కోర్టు మాకు అనుకూలంగా స్టే ఇవ్వడంతో ఇప్పుడు నా మనసు కుదుటపడింది. సర్కార్ ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు.
మాకు భూమే ముఖ్యం
రేవంత్‌రెడ్డి సర్కార్ ఎన్ని కేసులు పెట్టినా పోరాటాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదు. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు భూము లు ఇచ్చేదే లేదు. ఉన్న భూమిని సర్కార్‌కు ఇచ్చి నేను, నా పిల్లలతో కలిసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లా లా..? లేక భిక్షం ఎత్తుకోవాలా..?
ప్రభుత్వం ఇచ్చే పరిహారం మాకు వద్దే..వద్దు.. దాని కంటే నాకు భూమే ముఖ్యం.
-రూప్లానాయక్, పులిచెర్లకుంటతండా
భూసేకరణను నిలిపేసే వరకు కోర్టులను ఆశ్రయిస్తాం..
ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను నిలిపేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయ డం చాలా సంతోషకరం. ఈ తీర్పుతో మా భూములకు భద్రత.. మాకు భరోసా ఏర్పడింది. ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా మా భూములను మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఇచ్చే ప్రసక్తే లేదు. భూసేకరణను నిలిపేసే వరకూ తాము కోర్టులను ఆశ్రయిస్తూనే ఉంటాం.
-గోపాల్ నాయక్, బాధితుడు
హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉన్నది..
మాకు హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉన్నది. ఉన్న ఐదు ఎకరాల భూమిలోనే పంటలు పండించుకుని జీవిస్తున్నా. ఆ భూమిని మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఇస్తే.. నేను, నా కుటుంబం ఎలా బతకాలి. మాకు వ్యవసాయం తప్ప మరో జీవనాధారం లేదు. మా ప్రాణాలను అడ్డం పట్టైనా భూములను కాపాడుకుంటాం.
-రామూనాయక్, రోటిబండతండా..
ఫోర్త్ సిటీలో స్థానికులకే ఉద్యోగాలు : మంత్రి శ్రీధర్‌బాబు
బడంగ్‌పేట : ఫోర్త్సిటీతోపాటు మహేశ్వరం నియోజకవర్గంలో ఏర్పాటయ్యే ప్రతి పరిశ్రమలోనూ స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మహేశ్వరం సెగ్మెంట్ తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలో డీసీపీ కార్యాలయం, లెన్స్‌కార్ట్ పరిశ్రమ నిర్మాణానికి గురువారం ఆయన భూమి పూజ చేశారు. లెన్స్‌కార్ట్ పరిశ్రమ ఏర్పాటుకు 52 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. రూ.1500 కోట్ల పెట్టుబడితో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించనున్న ఈ పరిశ్రమలో 1500 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, రాచకొండ సీపీ సురేంద్రబాబు, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కంపెనీలతో మాకు ఉపయోగం లేదు
మా ప్రాంతంలో కంపెనీలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. కానీ, వాటి వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. మాకు ఉద్యోగాలు చేయాలనే ఆలోచనే లేదు. వ్యవసాయం అంటేనే ప్రాణం. మట్టిలోనే బతుకుతున్నాం. దానిలోనే కలిసిపోతాం. కానీ, భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తే లేదు. సర్కార్ బలవంతంగా భూములను తీసుకోవాలని చూస్తే ఎంతకైనా పోరాడుతాం. ప్రాణాలైనా ఇచ్చి భూములను కాపాడుకుం టాం. హైకోర్టులో మాకు అనుకూలంగా స్టే రావడం చాలా సంతోషంగా ఉన్నది.
-హీర్యానాయక్, పులిచెర్లకుంటతండా