రంగారెడ్డి, సెప్టెంబర్ 21 (నమస్తేతెలంగాణ)/ ఇబ్రహీంపట్నం : రంగారెడ్డిజిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇబ్రహీంపట్నంలోని కుమ్మరికుంట కాలనీలో ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.
బొంగ్లూరు సమీపంలో సాగర్ రహదారిపై పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భారీ వర్షాలతో చెరువు, కుంటల్లోకి వర్షపు నీరు చేరింది. ఆదివారం ఎంగిలిపువ్వు బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా పలువురు మహిళలు ఉదయం అడవికి వెళ్లి పలు రకాల పూలు తీసుకొచ్చారు. ఎంతో ఉత్సాహంతో బతుకమ్మను అలంకరించి ఆటాపాటలతో సందడి చేద్దామనుకున్న వారికి వర్షం తీవ్ర ఆటంకం కల్పించింది. పలు గ్రామాల్లో మహిళలు వర్షంలోనే బతుకమ్మ ఆడగా… మరికొన్ని ప్రాంతాల్లో బతుకమ్మ ఆడకుండానే నిమజ్జనం చేశారు. కొందరు మహిళలు నిరాశకు గురయ్యారు.
మంచాల : మండల పరిధిలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసిం ది. ఉదయం నుంచి ఉక్కపోతతో ప్రజలు సతమతమయ్యారు. సా యంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.