వికారాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. వానకాలం ప్రారంభం నాటి నుంచి అడపాదడపా వర్షాలు కురవగా, శనివారం సాయంత్రం నుంచి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
అత్యవసర సమయంలో సాయమందించేందుకు గాను విపత్తుల నిర్వహణ సంస్థ సిబ్బందిని అందుబాటులో ఉంచడంతోపాటు కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. వాగుల వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.
జూన్ నెలలో సాధారణ వర్షపాతానికి మించి నమోదైనప్పటికీ ఏడు మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. జూలై నెలలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 77.8 మి.మీటర్ల కాగా, ఇప్పటివరకు 147.1 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. జూలై నెలలో ఇప్పటివరకు సాధారణానికి మించి 89 మి.మీటర్ల వర్షపాతం అధికంగా నమోదైంది. జిల్లాలోని అన్ని మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది.
జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన వర్షంతో జిల్లావ్యాప్తంగా 41.4 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. నవాబుపేట మండలంలో అత్యధికంగా 91.2 మి.మీటర్ల వర్షపాతం నమోదు కాగా, కోట్‌పల్లి మండలంలో 60.8 మి.మీటర్లు, బంట్వారం మండలంలో 60.2 మి.మీటర్లు, వికారాబాద్ మండలంలో 56.4 మి.మీటర్లు, బషీరాబాద్, పూడూరు మండలాల్లో 47.4 మి.మీటర్లు, మోమిన్‌పేట మండలంలో 42.4 మి.మీటర్లు, యాలాల మండలంలో 38.6 మి.మీటర్లు, తాండూరు మండలంలో 38.4 మి.మీటర్లు, దోమ, దుద్యాల మండలాల్లో 35.2 మి.మీటర్లు, పెద్దేముల్ మండలంలో 34.2 మి.మీటర్లు, కొడంగల్ మండలంలో 34.8 మి.మీటర్లు, చౌడాపూర్ మండలంలో 30.6 మి.మీటర్లు, దౌల్తాబాద్ మండలంలో 21.6 మి.మీటర్లు, కులకచర్ల మండలంలో 24.6 మి.మీటర్లు, పరిగి మండలంలో 28.6 మి.మీటర్లు, మర్పల్లి మండలంలో 26.6 మి.మీటర్లు, బొంరాస్‌పేట మండలంలో 15 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.