తాడ్వాయి, మార్చి 3 : అడవిని నమ్ముకొని జీవిస్తున్న గొత్తికోయ గూడేలపై అటవీ శాఖ అధికారులు దాడులకు యత్నించిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండ లం కాల్వపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది. 25 ఏండ్లుగా సుమారు 50 కుటుంబాలకు చెందిన గొత్తికోయలను వెళ్లగొట్టేందుకు భూముల చుట్టూ కందకాలు తీసేందుకు అటవీ అధికారులు పూనుకోగా వారు అడ్డుకున్నారు. తమ హక్కులు, చట్టాలను కాలరాయొద్దని ప్రాథేయపడ్డారు. మంత్రి సీతక్క ఇలాకాలో ఇలాంటి ఘటన జరగడం గిరిజన గూడేల్లో చర్చనీయాంశంగా మారింది. ఇన్నేండ్లుగా ఇటు వైపుగా రాని అటవీ అధికారులు ఉన్నట్టుండి మూకుమ్మడిగా వచ్చి గూడెం బిడ్డలను వెళ్లగొట్టే ప్రయ త్నం చేయడంతో గొత్తికోయలు తల్లడిల్లిపోయారు. అడవినే నమ్ముకొని జీవిస్తున్న తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దని వేడుకున్నారు. అయినా అధికారులు వారి భూముల చుట్టూ కందకాలు తీసేందుకు జేసీబీతో కదిలారు. ఆగ్రహించిన గూడెం మొత్తం ఎదురుతిరిగింది. ఒకొనొక దశలో కట్టెలతో దాడులు చేసేందుకు అధికారులు పూనుకున్నా గొత్తికోయలు శాంతియుతంగా వారి చర్యలను అడ్డుకున్నారు. తమ భూ ముల్లో కందకాలు తీస్తే ఎలా బతకాలని ప్రశ్నించారు. ప్రభుత్వం అండతోనే దాడు లు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాణాలైనా వదులుకుంటాం కానీ, భూములు ఇవ్వబోమని జేసీబీకి అడ్డుగా నిలబడటంతో చేసేదేమి లేక అధికారులు వెళ్లిపోయారు.