హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్ : ‘పెండింగ్ బిల్లు ల కోసం మాజీ సర్పంచులు మా ఇంటికొస్తే టిఫిన్ పెట్టి, టీ తాపించి పంపిస్తానని గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడి యా ముఖంగా చెప్పారు. కానీ, జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆరుసార్లు వచ్చాం. అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మంగళవారం మళ్లీ వచ్చినా మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నా రు. ఇదేనా ప్రజాపాలన? ’ అని తెలంగాణ సర్పంచుల జేఏసీ నేతలు ప్రశ్నించారు. సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డికి మొరపెట్టుకునేందుకు వెళ్లిన తమను పోలీసులు గెంటివేయడం దారుణమని ఆగ్ర హం వ్యక్తంచేశారు.
తాము అపాయింట్మెంట్ కోసం వస్తే పోలీసులు కనీసం ఇంటి దగ్గరకు కూడా వెళ్లనీయలేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు పూర్తయినా, ఇప్పటిదాకా గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదని, గత ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులు తప్ప, కొత్తగా చేసిందేమీ లేదని పేర్కొన్నారు. మాజీ సర్పంచులకు రావాల్సిన బకాయిలను వెంటనే మంజూరు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రామపంచాయతీలకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి కేశబోయిన మల్లయ్యయాదవ్, నాయకులు పద్మారెడ్డి, సానబోయిన సుధాకర్‌గౌడ్, కల్లట్లపల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.