హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 16నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని అడిగితే.. లంకెబిందెలు ఖాళీగా ఉన్నాయని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు.
ఇటీవల ఓ సభలో సోనియా, రాహుల్‌గాంధీలకు అవసరమైతే రూ.1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్ మాట్లాడిన తీరు రాష్ట్ర ఖజానా నిల్.. కాంగ్రెస్ నాయకుల జేబులు ఫుల్ అనే విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సైతం కేంద్రం అందిస్తున్న వడ్డీ రహిత రుణాల మీద ఆధారపడటం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఉద్యోగుల జీతాలు, రైతు భరోసా నిధులు, సంక్షేమ పథకాల అమలు, గతంలో తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించేందుకు ప్రభుత్వం రుణాలపై ఆధారే పరిస్థితి ఉన్నదని వివరించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ర్టాన్ని గత 27 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు. ప్రతి ఏడాది పెరుగుతున్న రాష్ట్ర అప్పులు ఆందోళన కలిగిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.