ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. చేవెళ్లలోని బీజాపూర్ హైవేపై మిర్జాగూడ-ఖానాపూర్ గ్రామాల మధ్యలో భారీ మర్రి వృక్షం నేలపై పడడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. అదే విధంగా వికారాబాద్ జిల్లాలోని తాండూరులో సాయిపూర్ రోడ్డు మార్గంలో వర్షం నీటిలో ఆటో ఇరుక్కుపోయింది. మామిడి కాయలు రాలడంతోపాటు అరటి తోట నేలకు వంగింది. మైసమ్మగడ్డతండాకు చెందిన పిక్లానాయక్ అనే రైతు గొర్రెలపై పిడుగు పడడంతో 20 గొర్రెలు మృతి చెందాయి.
చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 17 : చేవెళ్ల మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వర్షం ధాటికి చేవెళ్ల మున్సిపాలిటీలోని ఓ ఫ్లెక్సీ విరిగి విద్యుత్ వైర్లపై పడడంతో నాలుగైదు గంటలపాటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. బీజాపూర్ హైవేపై మిర్జాగూడ-ఖానాపూర్ గ్రామాల మధ్యలో భారీ మర్రి వృక్షం నేలపై పడడంతో ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు, సంబంధిత శాఖ అధికారులు స్పందించి చెట్టును రోడ్డుపై నుంచి తొలగించి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో పలు చోట్లు విద్యుత్ వైర్లు తెగడంతోపాటు స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో ప్రజ లు ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా పలు గ్రామాల్లో వరి, మామిడి తోటలతోపాటు ఆరు తడి పంటలకూ నష్టం వాటిల్లింది.
రోడ్లన్నీ జలమయం
వికారాబాద్ : వికారాబాద్‌లో గురువారం సాయం త్రం ఈదురు గాలుల తో కూడిన వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చిన ప్రజలు, వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
బంట్వారం..
బంట్వారం, కోట్‌పల్లి మండలాల్లో గాలివా న బీభత్సం సృష్టించింది. సల్బత్తాపూర్ సమీపంలో గేటుకు వెళ్లే దారిలో రెండు చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. వాటిని అటుగా వెళ్తున్న జేసీబీ తొలగించింది. అలాగే, ఒగ్లాపూర్ గేటు దగ్గర భారీ తుమ్మ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిం ది. కోట్‌పల్లి మండలంలోని ఎన్నారంలోనూ వడగండ్ల వాన కురిసింది.
పిడుగు పడి 20 గొర్రెలు మృతి
బొంరాస్‌పేట : మండలంలోని బుర్రితండాకు అనుబంధంగా ఉన్న మైసమ్మగడ్డతండాకు చెందిన పిక్లానాయక్ అనే రైతు గొర్రెలపై పిడుగు పడడంతో 20 గొర్రెలు మృతి చెందాయి. గురువారం సాయంత్రం ఈదురు గాలితో కూడిన వాన రావడంతో పిక్లానాయక్ తన గొర్రెలను ఇంటికి దగ్గరలో ఉన్న చెట్టు కిందికి తీసుకెళ్లి.. తాను ఇంట్లోకెళ్లాడు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో దాని కింద ఉన్న 20 గొర్రెలు మృతి చెందాయి. వాటి విలువ రూ. 2,50,000 వరకు ఉంటుందని.. బాధి త రైతును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.
నెలకొరిగిన విద్యుత్ స్తంభాలు
ధారూరు : మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. నాగసముందర్ విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో స్తంభాలు నేలపై పడిపోవడంతో సరఫరాలో అంత రాయం ఏర్పడింది. అదేవిధంగా పలు చెట్లూ భూమిపై విరిగి పడిపోయాయి.
తాండూరులో భారీ వర్షం
తాండూరు : తాండూరు నియోజకవర్గంలో గురువారం సాయంత్రం ఈదురు గాలు లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన కురువడంతో చేతికొచ్చిన వరి పంట నేలకొరిగింది. మామిడి కాయలు రాలడంతోపాటు అరటి తోట నేలపై పడింది. తాండూరు మున్సిపల్ పరిధిలో భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. భారీ కటౌట్లు, బ్యానర్లు చిరిగి రోడ్లపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
శ్రీ భావిగి భద్రేశ్వర జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తోరణాలు ధ్వంసమయ్యాయి. సాయిపూర్ మార్గంలోని మురుగు కాల్వలు మూసుకుపోవడంతో వర్షం నీరుతోపాటు మురుగు రోడ్లపై ఏరులై పారింది. అదేవిధంగా వర్షం నీటిలో ఆటో ఇరుక్కుపోయింది. పెద్దేముల్ మండలంలోని కొండాపూర్‌లో గొట్లపల్లి శ్రీను, పట్నం శ్రీనివాస్, నెల్లిగడ్డతండాలో మూడావత్ బుజ్జిభాయ్ ఇండ్ల పై కప్పులు భారీ ఈదురు గాలికి ఎగిరిపడ్డాయి. నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో కరెంటు సరఫరా నిలిచిపోయిం ది. పగలు నెత్తి పగిలేలా ఎండ… సాయం త్రం ప్రమాదకరంగా గాలివాన బీభత్సంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.