రంగారెడ్డి, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డిజిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోయి బోర్లు ఎండిపోవటంతో వరి, ఇతరత్రా పంటలు పెద్దఎత్తున ఎండిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడే పంట పొలాలు ఎండిపోయి రైతులు ఆందోళనకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కాని కన్నెత్తి చూడటంలేదు. జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి అన్నదాతలను ఆదుకోవాల్సిన అధికారులు పంట పొలాల వైపు చూడటంలేదు. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. ముఖ్యంగా జిల్లా పరిధిలోని మంచాల, యాచారం, కేశంపేట, మాడ్గుల తదితర మండలాల్లో పెద్దఎత్తున వరిపంట పొలాలు ఎండిపోతున్నాయి. వారంరోజుల క్రితం పోసిన బోర్లలో ప్రస్తుతం చుక్క నీరు కూడా రాకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎండిపోయిన పంటలను పశువులకు దాణాగా ఉపయోగించాల్సి వస్తున్నది. ఎండలు తీవ్రమవుతుండటంతో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోవడంతో భూగర్భజలాల నీటిమట్టం భారీగా పడిపోయింది. గత వారం రోజుల్లో మూడు నుంచి నాలుగు మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. వారం రోజుల్లో 20 నుంచి 30 శాతం బోర్లు ఎండిపోయినట్లు రైతులు వాపోతున్నారు.
జిల్లాలో 93 వేల ఎకరాల్లో వరిసాగు
జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 93 వేల ఎకరాల్లో వరి పంట వేశారు. ముఖ్యంగా జిల్లా పరిధిలోని 21 గ్రామీణ మండలాల్లో వరి పంటను సాగు చేశారు. మంచాల, యాచారం, మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కేశంపేట, కొందుర్గు, చేవెళ్ల, షాబాద్ మండలాల్లో అత్యధికంగా వరి పంటలు ఎండిపోతున్నాయి. పంటలను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. అప్పులు చేసి వరి పంటలు వేశామని.. ఉన్న పంటలు ఎండిపోతుండటంతో అప్పులు ఎలా కట్టేదని రైతులు బోరుమంటున్నారు.
అకాల వర్షాలకు 500 ఎకరాల్లో పంట నష్టం
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో జిల్లాలో సుమారు 500 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఇందులో అత్యధికంగా మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందని, మరికొన్ని ప్రాంతాల్లో వరి పంట కూడా నేలరాలిందని అధికారులు తెలిపారు. మామిడి ఇతర కూరగాయల పంటలకు కూడా నష్టం జరిగింది.
కన్నెత్తి చూడని అధికారులు, ప్రజాప్రతినిధులు
గ్రామాల్లో కనీవినీ ఎరుగని రీతిలో పంటపొలాలు ఎండిపోయి జిల్లా రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కన్నెత్తికూడా చూడటంలేదని ఆరోపణలొస్తున్నాయి. జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
రెక్కల కష్టమంతా మట్టిపాలైంది
రెక్కలిరుసుకుని కష్టం చేసి వరి పంట వేసినం. వేసిన పంట అంతా ఎండిపోయింది. పంటచేతికొస్తే చేతిల ఇన్ని పైసలుంటుండే. నా కుటుంబానికి ఈ భూమే ఆధారం. ఎవుసం పని చేసుకుని జీవిస్తున్న మాకు బోరు ఎండిపోయి పంట అంతా పోయింది. పంట ఎండిపోతుండటంతో ఉన్న రెండు ఆవులను మేపుతున్నా. సర్కారు సార్లు ఎవరు వచ్చి చూస్తలేరు. మమ్ముల్ని ఆ దేవుడే కరుణించాలే.
– సపావట్ సీతారాం, కొర్రవానితండా, మంచాల మండలం