భూగర్భ జలాలు అడుగంటుతుండడం తో బోరుబావుల్లో నీరు ఇంకిపోతున్నది. చేతికందే దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. అప్పులు చేసి కొత్తగా బోర్లు వేస్తున్నా.. బోరు బావుల్లో పూడికతీత పనులు చేస్తున్నా లాభం లేకుండా పోతున్నది. కొద్ది రోజుల్లోనే చేతి కొస్తుందనుకున్న దశలో నీరు సరిపోక పంటలు ఎండుతుండడంతో అన్నదాతల ఆవేదన అంతా.. ఇంతా కాదు. అప్పులు తెచ్చి పంటలను సాగు చేశామని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇది ఒక్క షాబాద్ మండలంలోనే కాదు రంగారెడ్డి జిల్లా మొత్తం ఇదే పరిస్థితి నెలకొన్నది..
యాసంగిలో బోరుబావుల కింద సాగు చేసిన పంటలు సరిపడా నీరందక ఎండిపోతున్నా యి. గత బీఆర్ఎస్ హయాంలో సరిపడా వానలు కురియడంతో చెరువులు నిండి అలుగులు పారి బోరుబావుల్లో నీటిమట్టం ఘననీయంగా పెరిగింది. దీనికి తోడు కేసీఆర్ అం దించిన 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా, అదునుకు పెట్టుబడి సాయంతో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండే. కానీ, గతేడాది వర్షాలు సరిగ్గా కురువకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ప్రస్తుతం విద్యుత్తు కోతలు విధిస్తుండడంతో ఉన్న కొద్దిపాటి పంట కూడా నీళ్లు అందక ఎండుముఖం పడుతున్నది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంట కండ్ల ముందే ఎం డుతుండడంతో రైతు కంట కన్నీరు ఆగడం లేదు. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో వరిపంట పశువులకు మేతగా మారింది. బోరు బావుల్లో నీరు తగ్గడంతో వేసిన పంట ఎండిపోతున్నది. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. బోరుబావుల కింద వేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి కరువులేకుండా పుష్కలంగా నీరు, కరెంట్ ఉండడంతో సంతోషంగా పంటలను సాగు చేసుకునే వారిమని..మళ్లీ పదేండ్ల తర్వాత రైతులు కరువుతో అల్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నదాతలు వాపోతున్నారు. సాగునీటి కోసం రైతులు కొత్తగా బోర్లు వేస్తున్నా ఫలితం లేకుండా పోతున్నది. ఒక్కో రైతు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఖర్చు చేసి 600 నుంచి 800అడుగుల లోతు వరకు బోర్లు వేస్తున్నా చుక్క నీరు రావడంలేదు. దీంతో చేసిన అప్పులు ఏలా తీర్చాలో తెలియక మథనపడుతున్నారు. ప్రభుత్వం ఎండిపోయిన పంటలను పరిశీలించి పరిహారం చెల్లించాలని జిల్లాలోని రైతులు కోరుతున్నారు.
యాసంగిలో ఎకరం వరి పంట సాగు చేశా. నాకున్న అర ఎకరం తోపాటు మరో అర ఎకరాన్ని కౌలుకు తీసుకున్నా. ఫిబ్రవరి వరకు బాగానే నీరు పారింది. పంట చేతికొచ్చే దశలో బోరు నీళ్లు పోయకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది. పంట కోసం రూ.30 వేల వరకు ఖర్చు చేశా. ఎండిపోయిన పంటను పా డి ఆవులకు మేతగా వేస్తున్నా. ప్రభుత్వమే ఆదుకోవాలి.
నాకున్న మూడెకరాల పొలంలో నాలుగేండ్ల కిందట బోరు వేశా. ఈ ఏడాది వానకాలం లో వరితోపాటు పశువులకు గడ్డి సాగు చే శా. జనవరి చివరి వా రంలో నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు చుక్కా నీరూ పోయడం లేదు. వేసిన పంట, పశుగ్రాసం ఎం డిపోవడంతో పశువులకు మేతగా మారింది. ఇందుకోసం రూ.25 వేల వరకు అప్పు చేశా. అప్పు ఏలా తీర్చాలో తెలియడం లేదు.
యాసంగి మొదట్లో బోరు నుంచి పంటకు సరిపడా నీరు వచ్చిం ది. ఫిబ్రవరి నెలలో బోరు నుంచి నీరు రాకపోవడంతో రూ. 2.50 లక్షలు అప్పు చేసి రెండు బోర్లు వేశా. ఒక్కొక్కటి 600 అడుగులకు పైగానే వేశా. ఒక్క బోరు నుంచి వచ్చే నీరు పాడి ఆవులకు తాగేందుకు, పశుగ్రాసానికి కూడా సరిపోవడంలేదు. దీంతో చేసిన అప్పులు ఏలా తీర్చాలో అర్థం కావడంలేదు. ఆరుగాలం కష్టపడి పంటలు సాగుచేసే రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రైతులకు కరువు వచ్చింది. బోర్లు నీరు పోయకపోవడంతో వేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి. అన్నదాతలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గత బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా 24 గంటల కరెంట్తోపాటు అదునుకు పెట్టుబడి సాయం అందించి కేసీఆర్ అండగా నిలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందించకపోవడంతో రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేశారు. వాటిని ఎలా తీర్చాలో అర్థం కావడంలేదు. ప్రభుత్వం స్పందించి పంటలు ఎండిపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి.